AP Voters : ఏపీలో ఓటరు చైతన్యం.. అర్ధరాత్రి వరకు ఓటేశారు

ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగింది. పాయకరావుపేట, కళ్యాణదుర్గం, సర్వేపల్లి, చింతలపూడి, మచిలీపట్నంలలో తేదీ మారడంతో మళ్లీ మాక్ పోలింగ్ నిర్వహించి, ఓటింగ్ కొనసాగించాల్సి వచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత 3,500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. ఈ సారి రికార్డు స్థాయిలో 80% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.
ఏపీలో నిన్న అర్ధరాత్రి వరకు 78.25శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. అత్యధికంగా అమలాపురం(SC) లోక్‌సభ స్థానానికి 83.19శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖపట్నంలో 68% శాతం ఓటింగ్ జరిగింది. మరోవైపు అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా ధర్మవరంలో 88.61%, అత్యల్పంగా పాడేరులో 55.45% పోలింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం కల్లా ఈసీ పూర్తి వివరాలు వెల్లడించనుంది.
రాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను మహిళామణులు శాసించనున్నారు. పార్టీల భవితవ్యం వారి చేతిలోనే ఉందంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో పురుష ఓటర్ల సంఖ్య 2,03,39,851 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,58,615గా ఉంది. ఓటర్ల సంఖ్యలోనే కాక పోల్ అయిన ఓట్లలోనూ మహిళలవే అధికం. దీంతో వారు ఎటువైపు మొగ్గితే ఫలితాలు కూడా అటే అనుకూలంగా ఉంటాయన్న అంచనాలున్నాయి. మరి వారి తీర్పు ఎలా ఉండనుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com