AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
వైసీపీకి వంతపాడిన పోలీస్‌ అధికారుల బదిలీ... సమర్థ అధికారులకు కీలక బాధ్యతలు

వైసీపీ ప్రభుత్వ హయంలో జగన్‌ ఆదేశాలను అమలు చేయడంలో నిబంధనలను ఉల్లంఘించిన పలువురు ఐపీఎస్‌ అధికారులను పక్కన పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరిని పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం... సమర్థులైన పోలీసు అధికారులకు కీలక జిల్లాల సారథ్యాన్ని అప్పగించింది. భారీ ఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. జిల్లా ఎస్పీలను గత ప్రభుత్వం పావులుగా వాడుకుందని... ప్రతిపక్షాలపై వారిని ఊసిగొల్పి అడ్డమైన కేసులు పెట్టి వేధించిందన్న ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 37 మంది ఎస్పీ స్థాయి ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌... శ్రీకాకుళం ఎస్పీ రాధికకు పోస్టింగ్‌ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయించారు. రాధిక శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉంటూ వైసీపీ నేతలకు వత్తాసు పలికారు. టీడీపీ బాధితులు ఫిర్యాదులు చేసినా, గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.

జగన్‌ హయాంలో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపైన, మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంపైన వైసీపీ మూకలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చర్యలు తీసుకోవాల్సిన ఎస్పీ ఆరిఫ్‌ ప్రేక్షక పాత్ర పోషించారు. అనంతరం, జగన్‌ ప్రభుత్వమే ఆయనను నెల్లూరులో నియమించింది. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం ఆయనను డీపీజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన ఎస్పీ జగదీశ్‌కు కూడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారానికి వచ్చిన సినీనటుడు అల్లు అర్జున్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎన్నికల వేళ అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించినా అడ్డు చెప్పని ఎస్పీ రఘువీరారెడ్డిని పక్కన పెట్టారు. కడపలో వైసీపీకి నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ, ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ.. జగన్‌ ప్రత్యర్థి బీటెక్‌ రవిలాంటి వారిని తప్పుడు కేసుల్లో ఇరికించిన సిద్ధార్థ కౌశిల్‌కు పోస్టింగ్‌ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ ఆగ్రహానికి గురై సరైన పోస్టింగ్‌ లేకుండా ఉన్న ఐపీఎస్‌లకు ఈసారి సముచిత స్థానం దక్కింది. అనంతపురం ఎస్పీగా ఉన్న శ్రీనివాసరావును గత వైసీపీ ప్రభుత్వం బదిలీ చేసి ఆయన స్థానంలో అన్బురాజన్‌ను నియమించింది. ఈయనకు జగన్‌ కాంపౌండ్‌ అధికారిగా పేరుంది. అనంతపురం చంద్రబాబు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించి, ఐపీఎస్‌ హోదా రాగానే తెలంగాణ కేడర్‌కు వెళ్లిపోయిన ఎల్‌. సుబ్బరాయుడును డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకువచ్చారు. కీలకమైన తిరుపతి జిల్లాకు ఎస్పీగా నియమించారు. ఎర్రచందనం కట్టడి విభాగానికి ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.


Tags

Next Story