JAGAN: అన్న ఎడమొహం.. చెల్లెలు పెడమొహం

హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం వైసీపీ అధినేత ఒకే సమయంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే, కోర్టు ప్రాంగణంలో ఎదురుపడినప్పటికీ జగన్ తన సోదరి సునీతను పలకరించకుండానే వెళ్లిపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే, వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును కొనసాగించాలన్న పిటిషన్‌పై వాదనల కోసం సునీత కోర్టుకు వచ్చారు. అదే సమయంలో, తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కోర్టులో సునీతను చూసినప్పటికీ, జగన్ ఆమెతో మాట్లాడకుండా, పలకరించకుండానే ముందుకు సాగిపోయారు.
వైసీపీ శ్రేణుల రచ్చ
అక్రమాస్తుల కేసులో భాగంగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద వైసీపీ శ్రేణులు రచ్చరచ్చ చేశాయి. అభిమానులకు ఆయన కారు ఎక్కి అభివాదం చేశారు. అనంతరం నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. కేవలం జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు అడ్వకేట్లను మాత్రమే లోపలికి అనుమతించారు. రోడ్డుపై గుంపులుగా ఏర్పడి జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ నినాదాలు చేశారు. ‘2029లో రప్పారప్పా’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అందులో “88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే” అంటూ ఉత్సాహంతో ఊగిపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఆరేళ్ల తర్వాత కోర్టుకు హాజరైన వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. విచారణ అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్‌పాండ్‌కు వెళ్లిపోయారు. మరోవైపు వైసీపీ నేత పేర్ని నాని, మరో ముగ్గురు నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు గేట్ వద్దే నిలుచున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్‌పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

