AP: అంగన్వాడీల పోరుపై ఉక్కుపాదం
అంగన్వాడీల ఆందోళనలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టమని తాము చెప్పలేదని మంత్రులు చెబుతున్నా అధికారులు మాత్రం బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్లకు అప్పజెబుతున్నారు. దీనిపై అంగన్వాడీల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గుంటూరు, ఉండవల్లిలో రాత్రి వేళలో అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. గుంటూరు వేళాంగిణి నగర్‌లోని అంగన్వాడీ కేంద్రం తాళాన్ని పోలీసుల సమక్షంలో VRO పగలగొట్టించారు. రాత్రి 9 గంటలకు అంగన్వాడీ కార్యకర్తలను పక్కకుతోసి తలుపులు తెరిచి సరకులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి మాటలు లెక్క చేయని సచివాలయ సిబ్బంది కొత్త తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు VRO యత్నిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించకుండా తాళాలు తీస్తే ఒప్పుకోమన్నారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం, జనసేన, C.P.M. కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ కేంద్రం వద్ద బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న నేతలను బలవంతంగా పక్కకు లాగేశారు. కాసేపు ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని సుమారు 50 అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఆదివారం రోజున అధికారులు బద్దలు కొట్టారు. ఒక పక్క ఇంటి యజమానులు మరో పక్క అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుపడినా పట్టించుకోలేదు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు లేకుండా తాళాలు ఎలా పగలగొడతారని అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. పై నుంచు వచ్చి ఆదేశాలనే తాము పాటిస్తున్నామని ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. సచివాలయ సిబ్బంది దూకుడుగా వ్యవహరించడంపై అంగన్వాడీ కేంద్రాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే తాము మరోసారి ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అంగన్వాడీ సిబ్బందికి C.P.M. నేతలు అండగా నిలిచారు.
అంగన్వాడీలకు మద్దతుగా బాపట్ల జిల్లా చీరాలలో చిన్నారులు వినూత్న రీతినో నిరసనకు తెలిపారు. తమ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచండి అంటూ నినాదాలు చేశారు. తమ టీచర్లు తమకు కావాలని... అంగన్వాడీ కంద్రాల తాళాలు పగలగొట్టొద్దని పలకల మీద రాసుకుని వచ్చి ప్రదర్శించారు. అంతే కాకుండా తమకు మంచి పాలు, ఆరోగ్యకరమైన పౌష్ఠికాహారం ఇవ్వాలని చిన్నారులు కోరారు. తహసీల్దార్ కార్యలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నా నిరసన దీక్షలో పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com