CBN: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం

CBN: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం
ఇప్పటికే వైసీపీ ఓటమి ఖాయమైందన్న చంద్రబాబు... టీడీపీ-జనసేన ప్రభుత్వ స్థాపన ఖాయమని ధీమా

తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన తర్వాత శ్రీకాకుళంలో జరిగిన 'రా కదలిరా' సభకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు.. భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచి పాలనకు శ్రీకారం చుడతామని చంద్రబాబు చెప్పారు. జగన్‌కుఉత్తరాంధ్రపై ప్రేమ లేదని, ఇక్కడి భూములపైనే ప్రేమ ఉందని ఆరోపించారు.ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని చెప్పి నాశనం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో. తాను సహా అందరూ బాధితులేనని చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టులు పూర్తిచేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానన్న చంద్రబాబు ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రావాలన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు తమ ప్రభుత్వం చేయనున్న కార్యక్రమాలను.. మరోసారి చంద్రబాబు వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు దొరకట్లేదన్న చంద్రబాబు అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.


వైసీపీ హయాంలో పేదలు నిరుపేదలయ్యారని చంద్రబాబు విమర్శించారు. ఆ పార్టీ నేతలు ధనవంతులయ్యారని.. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్న దొంగ ప్రభుత్వం ఇదని చంద్రబాబు విమర్శించారు. నమ్మి ఓటు వేసిన ప్రజల్ని జగన్‌ మోసం చేశారు. ఇప్పుడు మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని... వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. కరెంట్‌ ఛార్జీలు సహా అన్నింటిపై ధరలు పెంచి, ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. పేదల వ్యక్తి ఎలా అవుతారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక.. కరెంట్‌ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని అన్నారు. యువతకు ఉపాధి కలిపిస్తామని... వర్క్‌ ఫ్రమ్‌ హోం పని విధానానికి శ్రీకారం చుడుతామన్నారు. అవసరమైతే వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ 45 రోజులు సైకిల్‌ ఎక్కి.. ప్రజల్లోకి వెళ్లి చైతన్యం కల్పించాలన్నారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్‌ 6 హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.


విశాఖను గంజాయి, నేరాలకు రాజధానిగా మార్చారని చంద్రబాబు విమర్శించారు. జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదు.. ఇక్కడి భూములపైనే ప్రేమ. విశాఖలో రూ.40వేల కోట్ల భూములు కొట్టేశారు. విశాఖకు వచ్చిన అన్ని కంపెనీలు పారిపోయాయని చంద్రబాబు విమర్శించారు. పాత్రుని వలసలో భూముల్ని బినామీ పేర్లతో రాయించుకొని, తిరిగి ఆ భూముల్నే ప్రభుత్వానికి అప్పగించి రూ. కోట్లు దండుకున్నాడు ఇక్కడి వైకాపా నేత. రోడ్లపై గుంతల వల్ల 27 మంది మృతి చెందారు. అయినా వారికి సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story