AP : జగన్ జనాలను అమ్మేస్తారు.. షర్మిల ఎదురుదాడి

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జగన్ పై విమర్శల తీవ్రత పెంచారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కడప ఎంపీగా బరిలో ఉన్న షర్మిల.. పాయింట్ టు పాయింట్ జగన్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ప్రజలను కూడా అమ్మేస్తారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో జగన్ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ..ఈసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు షర్మిల. అధికారంలోకి రాగానే 2.25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తాడు కానీ.. జగన్ మాత్రం నాలుగున్నరేళ్లు నిద్రపోయారని ఆరోపించారు.
మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారన్నారు షర్మిల. నాసిరకం మద్యం అమ్ముతూ.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని రైతులు అప్పులపాలయ్యారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com