PAWAN: ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం

PAWAN:  ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం
చిలకలూరిపేట సభలో గర్జించిన పవన్‌కల్యాణ్‌... ఏపీ పీఠం ఎన్డీఏదే అని ధీమా

ప్రజల పాలిట, ప్రతిపక్షాల పాలిట రాక్షసుడిలా మారిన జగన్‌ను గద్దె దించడం కష్టమేమి కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో త్వరలో రామరాజ్యం స్థాపన జరుగబోతోందని వ్యాఖ్యానించారు. దేశాన్ని ప్రధాని డిజిటల్ రూపంలోకి తీసుకెళ్తుంటే ఏపీలో వైసీపీ పెద్దలు బ్లాక్ మనీ కూడబెడుతున్నారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆరోపించారు.మద్యం అమ్మకాలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నాయని ఇందులో పారదర్శకత లేదన్నారు. ఇసుక దోపిడి, ఇష్టారాజ్యంగా సాగుతోందని, ఏపీలో శాంతిభద్రతలు లేవని దుయ్యబట్టారు.ఏపీని గంజాయి రాజధానిగా మార్చారని ఆరోపించారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధం కోసం మోదీ పాంచజన్యం పూరిస్తారని.. ధర్మం, న్యాయం గెలుస్తుందని ప్రకటించారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఏపీ ప్రజలు ఆశీర్వాదం పలకాలని కోరారు.


‘అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే పునర్‌ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చింది. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోంది. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే ఆయన వచ్చారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది.


జగన్‌ ఒక సారా వ్యాపారిగా మారారు. దేశమంతా డిజిటల్‌ ట్రాన్సక్షన్‌ చేస్తుంటే.. ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా.. ఈరోజు -3 శాతానికి దిగజారిపోయింది. అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి .. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసుడిని తీసేయటం కష్టం కాదు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్‌ విర్రవీగుతున్నారు. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ.. ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారు. రామరాజ్యం స్థాపన జరుగబోతోంది. ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం’’ అని పవన్‌ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story