JAGAN: జైల్లో మగ్గుతున్న కోడి కత్తి నిందితుడు

JAGAN: జైల్లో మగ్గుతున్న కోడి కత్తి నిందితుడు
సాక్ష్యం చెప్పని, విచారణకు హాజరుకాని జగన్‌... బెయిల్‌పైనే బయట ఉన్న జగన్‌

కోర్టు కేసుల్లో బాధితులు ఎవరైనా విచారణ త్వరగా పూర్తై తీర్పు రావాలని కోరుకుంటారు. కానీ కోడికత్తి కేసులో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం NIA కోర్టులో సాక్ష్యం చెప్పడం లేదు. విచారణకు వెళ్లడం లేదు. జగన్‌ ముఖ్యమంత్రిగా రాజభోగాలు అనుభవిస్తుంటే ఆయన సీఎం కావాలని కలలుకన్న కోడికత్తి శ్రీనివాసరావు మాత్రం ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడు. అక్రమాస్తుల కేసులో జగన్‌, బాబాయ్ హత్య కేసులో అబ్బాయ్‌ బెయిల్‌పై బయట తిరిగాలి..? మరి దళిత యువకుడు శ్రీనివాసరావు బయటకి రావొద్దా...? అని మానవ హక్కుల నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌....తీవ్ర ఆర్థిక నేరాలు, అవినీతి కేసులకు సంబంధించిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసుల్లో నిందితుడు. పదేళ్లుగా బెయిల్‌పైనే ఉన్నారు. అవినాష్‌రెడ్డి కూడా బాబాయ్‌ను గొడ్డలితో అత్యంత క్రూరంగా నరికి చంపిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడు. అవినాష్‌ను అరెస్టు చేయడానికి వెళ్తే కర్నూలులో CBIని జగన్‌ ముఠా ముప్పతిప్పలు పెట్టింది. ఉత్తచేతుల్తో వెనక్కి వెళ్లగొట్టింది. చివరకు పరువుపోయేలా ఉందంటూ విచారణకు హైదరాబాద్‌ కార్యాలయానికి పిలిపించి అలా అరెస్టు చేసి ఇలా పంపించేసింది. ఆ అరెస్టు కూడా మూడ్రోజులదాకా మూడో కంటికి తెలియనివ్వలేదు. ఒక్క నిమిషం కూడా జైలుకు పంపలేదు. కాగితాల్లో అరెస్టు చూపించి అవినాష్‌ను ఇంటికి పంపించారు.


M.L.C. అనంతబాబు తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి, శవాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసులో నిందితుడు. జైలుకెళ్లాడు. వైసీపీ నేతల జేజేల మధ్య జైలు నుంచి విడుదలయ్యాడు.జగన్‌తో వేదికలు పంచుకుంటున్నాడు. కానీ కోడికత్తి కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీనివాసరావుకు మాత్రం బెయిల్‌ లభించడం లేదు. ఐదేళ్లుగా విచారణ ఖైదీగా నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నాడు. కోడికత్తి శ్రీను తల్లిదండ్రులేమో. కోర్టుల చుట్టూ తిరుగుతూ కన్నీటి విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. CBI, ఈడీ కేసుల్లో బెయిల్‌పై బయటున్న జగన్‌ ఆ కేసుల విచారణ తేలేంత వరకూ విచారణ ఖైదీగానే ఉండాల్సి వస్తే పరిస్థితేంటి. ఇక్కడ జగన్‌... నిమిషాల లెక్కన ఫీజులు చెల్లించి దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాదులను నియమించుకోగలరు. కానీ.. శ్రీనివాసరావు తల్లిదండ్రులు కనీసం ఒక్క న్యాయవాదికీ డబ్బు ఇవ్వేలేని నిరుపేదలు. మరి ఆ దళిత బాధితుల కన్నీటి వేదన జగన్‌కు ఎందుకు పట్టదు.


గత ఎన్నికల్లో కోడికత్తి ఘటనతో రాజకీయ లబ్ధిపొందారు జగన్‌. కోడికత్తి దాడిచేయించింది చంద్రబాబేనని పెడబొబ్బలు పెట్టారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని,.. జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని మంకు పట్టు పట్టారు. అదే NIA ఇప్పుడు జగన్ అండ్‌ కో వాదనలో పసలేదని తేల్చింది. ఐనా ఇంకా లోతైన విచారణ జరపాలంటూ మళ్లీ NIA కోర్టుల్లో పిటిషన్‌ వేసి.. కేసును సాగతీస్తున్నారు జగన్‌. సాక్ష్యం ఇవ్వడానికి జగన్‌కు వచ్చిన ఇబ్బందేంటి? వచ్చే ఎన్నికలు పూర్తయ్యేదాకా కేసును కొలిక్కి రానీయొద్దన్నదే....... ఆయన లక్ష్యమా.? ఎన్నికల్లోగా శ్రీనివాసరావు బెయిల్‌పై బయటకొస్తే అసలు నిజం వెలుగులోకొచ్చి రాజకీయంగా నష్టపోతాననే భయమా.....? జగన్‌ తన రాజకీయ స్వార్థానికి.. ఓ దళిత యువకుడి జీవితాన్ని బలి చేయడం భావ్యమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story