YCP: వైసీపీ నేత కుమారుడి దాడిలో వ్యక్తి మృతి

నూతన సంవత్సర సంబరాల వేళ నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరానిగుండ్లలో విషాదం చోటుచేసుకుంది. పాతకక్షలతో ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుని బంధువులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అధికార వైకాపా నాయకుడి కుమారుడు తన అనుచరులతో కలసి మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరానిగుండ్లకు చెందిన ఖాదర్... నూతన సంవత్సర వేడుకల కోసం స్వగ్రామానికి వచ్చారు. వైకాపా నేత చినమద్ది కుమారుడు ఓబులేశుతో ఖాదర్‌కు పాతకక్షలున్నాయి. తన అనుచరులతో కలిసి ఓబులేశు... ఖాదర్‌పై దాడి చేశారు. తర్వాత ఖాదర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేశారు. ఇంట్లోని వస్తువులను, రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో ఖాదర్ మృతిచెందారు.
ఖాదర్ మృతితో ఆయన కుంటుంబసభ్యులు డోన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సరైన సమాధానం చెప్పడం లేదని జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాదాపు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com