YCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ కార్యకర్తలు..

YCP: వైసీపీ నేతల స్వరం మారుతోంది. పొరపాటున మాట్లాడుతున్నారో.. లేక ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత కారణంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారో కానీ... వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్ల వెనుక మర్మమేంటో అర్థంకాక పార్టీ క్యాడర్ జుట్టు పీక్కుంటోంది. తాజాగా మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల లోగుట్టు ఏంటో అర్థంకాక వైసీపీ కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఉండగానే హాట్ కామెంట్స్ చేశారు మంత్రి జోగి రమేష్.
వేదికపై ఉన్న నాయకులు ఈ రోజు వైసీపీలో ఉండొచ్చు .. రేపు మరోపార్టీలో ఉండొచ్చంటూ బాంబు పేల్చారు. వెల్లంపల్లి ఈరోజు వైసీపీలో ఉన్నా.. రేపు మరో పార్టీలో చేరవచ్చన్నారు. కానీ జగన్ మాత్రం ఉంటారని.. ఆయన వెంట కార్యకర్తలు ఉంటారని అన్నారు. కార్యకర్తలను పొగిడితే చప్పట్ల వర్షం కురుస్తుందనున్నారో.. లేక రేపు జరగబోయే పరిణామాలు ముందుగా చెప్పారో ఏమో కానీ.. మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలతో వేదికపై ఉన్నవారితో పాటు కార్యకర్తలు ఖంగుతిన్నారు. ఆయన మాటల్లో మర్మమేమిటో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com