Nara Lokesh: మూడు నెలలు ఓపిక పట్టండి, వచ్చేది టీడీపీ ప్రభుత్వంమే - లోకేష్

Nara Lokesh:  మూడు నెలలు  ఓపిక పట్టండి, వచ్చేది టీడీపీ ప్రభుత్వంమే - లోకేష్
విద్యార్ధులతో , నిరుద్యోగులతో మాతా మంతీ

మరో 3 నెలల్లో తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని యువతకు సకాలంలో ఉపాధి-ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లోకేష్‌ యువతకు భరోసా కల్పించారు. శాంతి భద్రతలు గాడిలో పెట్టి మహిళలు, ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించకపోయినా గంజాయి మత్తులో వారి జీవితాలు చిత్తు చేస్తోందని... లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించి.. రాష్ట్రం నుంచే తరిమేస్తామని చెప్పారు. కోనసీమ జిల్లాలో యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. అశేష జనవాహిని లోకేష్‌ యాత్రకు తరలివచ్చి మద్దతుగా నిలిచింది.

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. 211వరోజు పేరూరు క్యాంప్‌ సైట్‌ నుంచి యాత్ర ప్రారంభించిన లోకేష్‌కు... స్థానికులు, తెలుగుదేశం, జనసేన నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. క్యాంప్‌ సైట్‌ దగ్గరే కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, రౌతులపూడి ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మీ, భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ, తూర్పులక్ష్మీపురం సర్పంచ్‌ వీరంరెడ్డి సత్యనాగభార్గవితో పలువురు... లోకేష్‌ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. అక్వా రైతులు లోకేష్‌ని కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. అనంతరం యాత్రగా ముందుకు సాగారు. స్థానికులకు నమస్కరిస్తూ వారి సమస్యలు వింటూ లోకేష్‌ ముందుకు సాగారు.అనంతరం భట్నవిల్లిలో హలో లోకేష్‌ కార్యక్రమంతో యువతతో ముఖాముఖి నిర్వహించిన లోకేష్‌ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సాయంత్రానికి యాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వివిధ వర్గాలతో లోకేశ్‌ సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా ఓ విద్యార్థి ఆవేదనను విన్న టీడీపీ యువనేత నారా లోకేష్.. ఆ తమ్ముడ్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి నిర్వహించిన నారా లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గం కోడుపాడుకు చెందిన కె.దుర్గారెడ్డి తమ కష్టాలను తెలియజేస్తూ.. “నేను అమలాపురంలోని ఎస్కేబీఆర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ హెచ్ఈసీ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అక్కడ సరైన సదుపాయాలు లేక చదువు మానేశాను. తర్వాత ఐటీఐ చదువుతానని నాన్నతో చెబితే.. మనకు అంత స్థోమత లేదు వద్దన్నారు. దాంతో టీసీ తీసుకొని ఇంటివద్దే ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటున్నాను” అని చెప్పాడు. దీంతో యువనేత లోకేష్ స్పందిస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేసిన దుర్గారెడ్డిని తాను చదివిస్తానని చెప్పారు. సంబంధిత విద్యార్థి వివరాలు తీసుకోవాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.

Tags

Next Story