LOKESH: త్వరలో రెడ్‌బుక్ మూడో చాప్టర్
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, త్వరలోనే మూడో చాప్టర్ తెరుస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్‌బుక్‌కు భయపడుతున్న వైఎస్ జగన్.. గుడ్‌బుక్ తీసుకొస్తామంటున్నారని, కానీ బుక్‌లో ఏమి రాయాలో ఆయనకు అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తాం. సందేహం లేదు. త్వరలోనే రెడ్ బుక్ మూడో చాప్టర్ కూడా తెరుస్తాం’’ అని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రవాసీయులు భయపడలేదు
గతంలో సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు భయపడకుండా ప్రవాస భారతీయులు నిలబడ్డారని లోకేశ్ ప్రశంసించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. సంక్షేమం అంటే ఏమిటో ఎన్టీఆర్ చేసి చూపారని గుర్తు చేశారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తలెత్తుకుని తిరిగే పరిస్థితిని ఎన్టీఆర్ తీసుకొచ్చారని అన్నారు. ఆయన ఆశయాలను సాకారం చేయడంలో ఎప్పుడూ ముందుంటామని లోకేశ్ ప్రకటించారు. అమెరికాలోని ఆంధ్రులు ఎన్‌ఆర్‌ఐలు కాదని.. ‘ఎంఆర్‌ఐ’లని లోకేశ్ కొత్త నిర్వచనం చెప్పారు. మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్(ఎంఆర్‌ఐ) అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి గెలుపు ప్రపంచంలోని ప్రతి తెలుగువారిదని లోకేశ్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేత కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో అభిమానులు హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపించారు.
రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ మైండ్ గేమ్
ఏపీలో రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, త్వరలోనే మూడో చాప్టర్ తెరుస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మొదటి రెండు చాప్టర్లలో ఎంతమందిని శిక్షించారో లోకేశ్ ప్రకటించలేదు. అయితే రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతల్లో భయం పెంచేందుకు లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న చర్చ మాత్రం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com