MODI: వైసీపీ ఓటమి ఖాయమైంది

MODI: వైసీపీ ఓటమి ఖాయమైంది
X
జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రధాని పిలుపు... వికసిత ఆంధ్రప్రదేశ్‌ తమ లక్ష్యమని చిలకలూరిపేట సభలో ప్రకటన

అవినీతిమయమైన జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్న మంత్రులతో జగన్‌ కేబినెట్‌ నిండిపోయిందన్న ఆయన గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి అధికారం ఇస్తే... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడతామని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పూడిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ.... జగన్‌ సర్కారు పాలనా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, కేంద్రంలో మరోసారి N.D.A ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.


ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని.... రెండూ ఒకే తాను ముక్కలని... ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వచ్చే ఐదేళ్లు అత్యంత కీలక సమయమని, అందుకోసం N.D.A ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు సాధించి మూడోసారి అధికారం చేపట్టాక..చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని తెలిపారు.రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలతో తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్‌ సహా తెలుగుబిడ్డ పి.వి.నరసింహారావును కాంగ్రెస్‌ తీవ్రంగా అవమానించిందని మోదీ అన్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్‌, పీవీని భాజపా ప్రభుత్వం గౌరవించిందని గుర్తుచేశారు.


‘‘ఎన్డీయే సర్కారులో ప్రతిఒక్కరూ పేదల కోసం పనిచేస్తారు. ఆవాస్‌ యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు ఇచ్చాం. జలజీవన్‌ మిషన్‌ కింద కోటి ఇళ్లకు తాగునీరు అందించాం. కిసాన్‌ సమ్మాన్‌ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు ఇచ్చాం. ఆయుష్మాన్‌ భారత్‌తో ఏపీలో 1.25 కోట్ల మందికి లబ్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూరివర్సిటీని ఏర్పాటు చేశాం. విశాఖలో ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌, మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మించాం. పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ యువత కోసం అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఇవి స్థాపించాం. వచ్చే ఐదేళ్లూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకే అవకాశం ఇవ్వండి. ఏపీలో నీలి విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మహిళలు, యువతకు కొత్త అవకాశాల సృష్టికి ప్రణాళికలు ఏర్పడుతాయి’’ అని మోదీ అన్నారు.

Tags

Next Story