AP: ఏపీలో గిట్టుబాటు ధర లేక నిమ్మరైతుల ఆవేదన

AP: ఏపీలో గిట్టుబాటు ధర లేక నిమ్మరైతుల ఆవేదన
నెల్లూరు జిల్లాలో దయనీయంగా నిమ్మ రైతుల పరిస్థితి... నీటి మూటలైన జగన్‌ హామీలు

కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక నిమ్మరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు జిల్లాలో నిమ్మరైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సరైన ధరలేక నష్టపోతున్నామని నిమ్మ రైతులు వాపోతున్నారు. 2019లో సీఎం జగన్‌ నిమ్మరైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నా నిమ్మరైతులను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అనేక మండలాల్లోని రైతులు వేలాది ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. పొదలకూరు, గూడూరులో నిమ్మ మార్కెట్లు ఉన్నప్పటికీ సరైన గిట్టుబాటు ధరలేక రైతులు నష్టపోతున్నారు. దళారుల దోపిడీ జరగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ధరలు స్థిరీకరించి...రైతులకు గిట్టుబాటు అయ్యేలా ధర కల్పిస్తామని 2019లో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ... నేటికి నెరవేరలేదని నిమ్మ రైతులు గోడు వెల్లబోసుకుంటున్నారు.

ఐదేళ్లుగా సరైన ధర లేక నిమ్మ రైతులు అల్లాడుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిగ్‌జాం తుపాను కారణంగా నిమ్మచెట్లు పడిపోయి తీవ్రంగా నష్టపోయినప్పటికీ.... కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. రైతుల ప్రభుత్వమని.. గొప్పలు తప్ప చేసిందేమీ లేదని రైతులు అంటున్నారు. హామీ ఇచ్చి నిమ్మ రైతులను నట్టేట ముంచిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story