AP: "ఆడుదాం ఆంధ్రా"కు స్పందన కరువు

AP: ఆడుదాం ఆంధ్రాకు స్పందన కరువు
పలుచోట్ల ఖాళీగా దర్శనమిచ్చిన మైదానాలు... తొలిరోజు పోటీలను మమ అనిపించిన అధికారులు

జగన్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "ఆడుదాం ఆంధ్రా" కార్యక్రమానికి క్రీడాకారుల నుంచి స్పందన కరవైంది. పలుచోట్ల ఆటగాళ్లు లేక క్రీడా మైదానాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అరకొర సౌకర్యాల మధ్య అధికారులు తొలిరోజు పోటీలను మమ అనిపించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్రా పోటీలను అధికారులు ప్రారంభించగా... కార్యక్రమానికి వాలంటీర్లు గైర్హాజరయ్యారు. తొలిరోజూ బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహించాల్సి ఉండగా ఒకే ఒక్క క్రీడాకారిణి హాజరయ్యారు. క్రీడాకారుల కోసం ఎంతసేపు వేచిచూసినా ఫలితం లేకుండా పోయింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ళ హైస్కూల్‌కు క్రీడా ప్రాంగణం లేకపోవడంతో జగనన్న లేఔట్ లో తాత్కాలిక ఏర్పాటు చేశారు. దీంతో మధ్యాహ్నం వరకు ఆటలు ప్రారంభం కాలేదు. ముమ్మడివరం బాలికల ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులకు తీసుకొచ్చిన ఇసుక గుట్టల మధ్యే పోటీలు నిర్వహించారు. స్థానిక జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో ఒక పక్క పందులు సంచరిస్తుండగా క్రికెట్ పోటీలు నిర్వహించారు.


కృష్ణాజిల్లా మొవ్వ మండల పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్నం వరకు పోటీలు ప్రారంభం కాలేదు. క్రీడాకారుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులకు ఎదురుచూపులు తప్పలేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, A.S. పేట మండలాల్లో క్రీడాకారులు లేక మైదానాలు వెలవెలబోయాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో... 24 వేల మంది పేర్లను నామమాత్రంగా రిజిస్ట్రేషన్ చేశారు. A.S.పేటలో ప్రజాప్రతినిధులు ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే మైదానమంతా బోసిపోయింది. ఆటల మాటున ప్రజాధనం దోపిడీకి ప్రభుత్వం యత్నిస్తోందని... విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఆట వస్తువులను... నాయకులే తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

YSR జిల్లా ఎర్రగుంట్లలో... ఆడుదాం ఆంధ్రాను మున్సిపల్ ఛైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మొదటి మ్యాచ్‌లోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. కిట్లు లేకుండానే.. నాసిరకం సామగ్రితో ఎలా ఆటలాడిస్తారని స్థానికులు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామ సమీపంలో తారురోడ్డుపై క్రికెట్ ఆడించారు. దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో పక్కనున్న మైదానంలోకి వేదికను మార్చారు. మైదానాలు సిద్ధం చేయకుండానే ఆటల పోటీలు ఎలా నిర్వహిస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ఆటగాళ్లు లేక క్రీడా మైదానాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అరకొర సౌకర్యాల మధ్య అధికారులు తొలిరోజు పోటీలను మమ అనిపించారు.

Tags

Read MoreRead Less
Next Story