JAGAN: జగన్‌కు పిచ్చి ముదిరిందన్న లోకేశ్

సామర్లకోట సభలో సీఎం జగన్..పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం., జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే ఆయనకు పిచ్చి ముదిరిందని స్పష్టం అవుతోందని లోకేశ్ ఎద్దేవా చేశారు. అక్కా, చెల్లెల్లు, కుటుంబ గౌరవాల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు అసలు ఉందా అని ఆ పార్టీ సీనియర్ నేత నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు. తన ఇంటి చెల్లెళ్లు షర్మిల, సునీతకు ఏపాటి గౌరవం దక్కుతోందో జగనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదల ముఖాలు చూడకూడదని రాత్రికి రాత్రే ఖాళీ చేయించిన సీఎం, పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలు కచ్చితంగా మహిళలను కించపర్చేలా ఉన్నాయని జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పవన్‌పై చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల మాటలు, చేతలకు దీటుగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు, పవన్‌కు ఏపీలో నివాసాలు లేవని ఇతర రాష్ట్రాల్లోనే ఉంటారని సామర్లకోట సభలో జగన్ అన్నారు. అలాంటి వారికి రాష్ట్రంపై ప్రేమ ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో..జగనన్న ఇళ్లకు ప్రారంభోత్సవం చేసిన సీఎం ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ పై మరోసారి వ్యక్తిగత విమర్శలకు దిగారు. మూడు, నాలుగేళ్లకు ఒక భార్యను మార్చే పవన్ కల్యాణ్ తన వర్గ ప్రజలను అమ్మకానికి పెట్టారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సభకు తరలివచ్చిన జనం తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ జన సమీకరణ చేయాలని అధికారులు హుకుం జారీ చేయటంతో క్షేత్రస్థాయిలో జనాల్ని భారీగా తీసుకువచ్చారు. సామర్లకోటలో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనాన్ని బస్సుల్లో తీసుకొచ్చి దించారు. బస్సుల వద్దకు ఎండలో కిలోమీటర్ల మేర జనం నడవాల్సి వచ్చింది. సభ లోపల ఉక్కపోత కారణంగా జనం అల్లాడి పోయారు. జనం బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా... పోలీసులు బారికేడ్లు మూసి వేసి ఆపే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు బయటకు వెళ్లారు. వృద్ధుల్ని సైతం సభకు తీసుకురావడంతో వారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. సభలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోగా.. ఓ మహిళ రోడ్డుపై కుప్పకూలింది. సభ ముగిసిన తర్వాత సీఎం కాన్వాయ్ కోసం జనాల్ని ఆపేసి... పోలీసులు అడ్డంగా నిలబడ్డారు. ఆహార పొట్లాలు అందరికీ అందలేకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com