LOKESH: ఎస్మా ప్రయోగంపై మండిపడ్డ ప్రతిపక్షాలు

LOKESH: ఎస్మా ప్రయోగంపై మండిపడ్డ ప్రతిపక్షాలు
జగన్‌ నియంత పోకడలకు నిదర్శనమన్న లోకేశ్‌... నిరసనలు నేరాలుగా మారాయన్న రామకృష్ణ

అంగన్వాడీలపై ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించడాన్ని విపక్షాలు ఖండించాయి. అంగన్వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం సీఎం జగన్ నియంత పోకడలకు నిదర్శనమని మండిపడ్డాయి. అమ్మనే గెంటేసిన వారికి అంగన్వాడీల విలువ ఎలా తెలుస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ తెచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని తప్పుపట్టిన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఏపీలో శాంతియుత నిరసనలు కూడా నేరాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రజా సమస్యలను గాలికి వదిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థానాలు మారిస్తే గెలవలేరని స్పష్టంచేశారు.

అయితే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం సమంజసమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారని...... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీలు ఉన్నారని తెలిపిన సజ్జల వారిని విధుల్లో చేరాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


డిమాండ్ల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న తమపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. జగన్‌ సర్కార్‌ ఉక్కుపాదాన్ని మోపడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలను తీవ్రతరం చేశారు. 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బెదిరిస్తే.. రెట్టించిన పట్టుదలతో సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. జగన్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా తప్పుపట్టారు. విజయవాడలోని రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీ, కార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. విజయవాడ ధర్నాచౌక్‌లో అంగన్వాడీలు 24 గంటల రిలే దీక్షలు చేపట్టారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రేగులపాడుకు చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్త... దీక్షా శిబిరంలోనే స్పృహ తప్పి పడిపోయారు. గుంటూరులో సమ్మె కొనసాగించిన అంగన్వాడీలు... ప్రభుత్వం అణచివేత ధోరణికి భయపడేది లేదని తేల్చిచెప్పారు

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సబ్‌కలెక్టర్‌ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు.. మంత్రి ఉష శ్రీచరణ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, అంగన్వాడీలకు మధ్య జరిగిన తోపులాటలో... వినుకొండ మండలం మరుగుపల్లికి చెందిన అంగన్వాడీ సహాయకురాలు నారాయణమ్మ అస్వస్థకు గురై కింద పడిపోయారు. అంగన్వాడీలను పట్టించుకోకుండా మంత్రి ఉష వెళ్లిపోవడంతో.. కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో అంగన్వాడీలు.. పొర్లుదండాలతో నిరసన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story