AP Current Charges: ఏపీలో కరెంట్‌ ఛార్జీల పెంపు.. ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్న చంద్రబాబు..

AP Current Charges: ఏపీలో కరెంట్‌ ఛార్జీల పెంపు.. ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్న చంద్రబాబు..
AP Current Charges: ఏపీలో కరెంట్‌ ఛార్జీలు పెంచడంపై విపక్షాలు భగ్గుమన్నాయి.

AP Current Charges: ఏపీలో కరెంట్‌ ఛార్జీలు పెంచడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. విద్యుత్ ఛార్జీల బాదుడు పట్ల ప్రభుత్వంపై పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే.. దానికి రివ‌ర్స్ చేస్తాడని టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు.

క‌రెంటు చార్జీలు బాదుడే.. బాదుడంటూ నాడు దీర్ఘాలు తీశాడని, ఇప్పుడు చార్జీలు భారీగా పెంచి జ‌నానికి షాక్ కొట్టించారని మండిపడ్డారు. మాట త‌ప్పుడుకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌.. మడ‌మ తిప్పుడుకి ఐకాన్ జ‌గ‌న్‌ అన్నారు లోకేష్ శ్రీశుభకృత్ నామ సంవత్సరం ప్రారంభంలోనే కరెంటు చార్జీలు అమాంతంగా పెంచారని జీవీఎల్‌ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఉగాదిని చెడుగా మిగల్చాలని సీఎం భావిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. పేదలపైనా చార్జీలు పెంచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దీనికి జగనన్న విద్యుత్ చార్జీల వడ్డన అని పేరు పెట్టలేదేం? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలతో కలిసి జనసేన ఉద్యమిస్తుందని ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసినవారు ఇంట్లో ఫ్యాన్ వేసుకోవడానికి కరెంట్ లేకుండా పోయిందన్నారు.

స్లాబ్‌ల పద్ధతి ఎందుకు మార్చాల్సి వచ్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చీప్‌ లిక్కర్‌ను కాస్ట్‌లీ ధరలకు అమ్ముతూ ప్రజల్ని దోచుకుంటున్న జగన్‌రెడ్డి.. ఇప్పుడు కాస్ట్‌లీ కరెంట్‌ పథకం అమలుకు సిద్ధమయ్యారంటూ విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు. 13 స్లాబుల్ని ఆరు స్లాబ్‌లుగా కుదించిన జగన్‌రెడ్డి... పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపారంటూ మండిపడ్డారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపు సరైందీ కాదంటూమండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సామాన్యుల జీవితాలతో సీఎం జగన్‌ ఆడుకుంటున్నారంటూ ఫైర్‌ అయ్యారు. తక్షణమే పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ అప్పటి ప్రభుత్వంపై బాదుడే.... బాదుడు అంటూ తెగ ప్రచారం చేశారని.. ఇప్పుడు ఈ బాదుడు ఏమిటని బాబురావు ప్రశ్నించారు. జగన్‌ సర్కారు విద్యుత్‌ ఛార్జీలు పెంచడాన్నినిరసిస్తూ.. విజయవాడ బీసెంట్‌ రోడ్డులో వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వేసవికాలంలో... కరెంట్‌ ఛార్జీల మోత ఏంటని ప్రశ్నించారు సీపీఎం నేతలు. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అటు తిరుపతిలోనూ ఆందోళనకు దిగాయి విపక్షాలు. తక్షణమే కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలంటూ డిమాండ్‌ చేశాయి. లేదంటే మరో విద్యుత్‌ ఉద్యమం జరుగుతుందంటూ హెచ్చరిచాయి.

Tags

Read MoreRead Less
Next Story