పట్టాభి కారును వైసీపీ గూండాలు ధ్వంసం చేయడం దుర్మార్గం : లోకేష్‌

పట్టాభి కారును వైసీపీ గూండాలు ధ్వంసం చేయడం దుర్మార్గం : లోకేష్‌

విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కారు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. రాత్రి ఆయన నివాసంలో ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు సరిహద్దు రాళ్లతో దాడిచేశారు.. దాడిలో పట్టాభి కారు వెనుక, ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. ఘటన జరిగిన తీరు చూస్తే ఇది వైసీపీ పనిగానే కనిపిస్తోందని పట్టాభి ఆరోపించారు. తరచుగా వైసీపీ ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తున్నందునే తనను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందని అన్నారు. విజయవాడలో వీఐపీలు ఉండే ఏరియాలోనే పట్టాభి కారుపై దాడి జరిగిందంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ విధానపరమైన లోపాల్ని ప్రశ్నిస్తున్న వారిపై దాడులు జరుగుతుండడం చూస్తుంటే వైసీపీ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టు అర్థమవుతోందంటున్నారు.

కారు ధ్వంసం ఘటన దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు రియాక్టయ్యారు.. హడావిడిగా ఘటనా స్థలానికి వచ్చారు.. క్లూస్‌ టీమ్‌ కూడా రంగంలోకి దిగి దాడికి గురైన కారును పరిశీలించింది.. ఆధారాలు సేకరించింది.. ఈ ఘటన కుట్రపూరితంగా జరిగిందా.. లేక ఆకతాయిల పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అటు ఈ ఘటనపై పట్టాభిరామ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఫోన్‌ చేశారు. కారు ధ్వంసంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ సర్కార్‌ ఎన్ని అరాచకాలు సృష్టించినా భయపడవద్దని... పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇటువంటి సమయంలోనే మనోధైర్యంతో ఉండాలని ధైర్యం చేప్పారు చంద్రబాబు.

పట్టాభిరామ్‌ కారు ధ్వంసం ఘటనపై తీవ్ర స్థాయిలో రియాక్ట్‌ అయ్యారు నారా లోకేష్‌. వైసీపీ సర్కార్‌ తీరును ట్విట్టర్‌ ద్వారా ఎండగట్టారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని.. పట్టాభి కారును వైసీపీ గూండాలు ధ్వంసం చేయడం దుర్మార్గమని ట్వీట్‌ చేశారు. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించేవారిపై వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. నిన్న సబ్బం హరి నివాసం ధ్వంసం... ఇప్పుడు పట్టాభి కారుపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందనా అని ప్రశ్నించారు నారా లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story