Pawan Kalyan: అహంకారంతో విర్రవీగుతూ ఎలా ప్రవర్తించాలో నాకూ తెలుసు- పవన్

Pawan Kalyan (tv5news.in)
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ సర్కారు పాలనలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ పర్యటించారు. సీఎం జగన్ సహా కొందరు మంత్రులు, వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా దూషించడంపై పవన్ మండిపడ్డారు. రైతు సమస్యలను ఎత్తిచూపితే తనను దత్తపుత్రుడని అన్నారని.. ఇంకోసారి దత్తపుత్రుడు అంటే సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని జగన్‌కు హెచ్చరించారు.
చంచల్‌గూడలో షటిల్ ఆడిన మీరు నన్ను విమర్శించడమేంటని ప్రశించారు పవన్. మరోవైపు కొందరు మంత్రులు, వైసీపీ నేతలు అహంకారంతో విర్రవీగితున్నారని, జనసైనికులపై దాడి చేయించారని మండిపడ్డారు. ఇకపై జనసైనికులపై చేయి పడితే మాత్రం సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం విధానాలను ఎండగట్టారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడమేంటని ప్రశ్నించారు.
మద్యం, చికెన్ దుకాణాలు పెట్టేందుకు ప్రజలు ఎన్నుకున్నారా..? అని నిలదీశారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే గ్రామ సచివాలయాలు ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. రైతులను ఆదుకునేందుకు ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, కేంద్రం ఇచ్చిన 6 వేల రూపాయలు కాకుండా 13 వేల 500 ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు.. జనసేన కౌలు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న 41 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించారు.
పెదవేగి మండలం విజయరాయి, జానంపేట, లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, లింగపాలెం ప్రాంతాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు. జగన్ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి కౌలు రైతులకు పరిహారం అందేలా చూస్తామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com