Andhra Pradesh : రోడ్డు బాగు చేయండి.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు

ముమ్మిడివరం నుండి అయినాపురం మీదుగా కాట్రేనికోన వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని, గోతులమయంగా మారిన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఈ రహదారిని పట్టించుకోకపోవడం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన అయినాపురం, సోమిదేవరపాలెం గ్రామాల ప్రజలు రోజువారీ ప్రయాణాల్లో చాలా కష్టాలు పడుతున్నారు. సాధారణంగా కాట్రేనికోన నుండి ఈ రహదారి మీదుగా ముమ్మిడివరం వెళ్లాలంటే కేవలం 10 కిలోమీటర్ల ప్రయాణమే సరిపోతుంది.. కానీ, రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు మహిపాల చెరువు మార్గం ద్వారా వెళ్లవలసి వస్తోంది. దీంతో అదనంగా మరో 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం ద్వారా ప్రయాణం చేయడం వల్ల సమయం, ఇంధనం వృథా అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో జనసైనికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.. జనసైనికులు తమ సొంత ఖర్చులతో రహదారిపై ఉన్న గోతులను పూడ్చే పనులు చేపట్టారు. "ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ రహదారిని శాశ్వతంగా బాగుచేయాలి" అని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు... ఈ రహదారి మరమ్మతులు జరిగితే స్థానిక గ్రామాల ప్రజలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రావాలని అందరూ కోరుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com