సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ..!

సీఎం జగన్‌కు మరో లేఖాస్త్రాన్ని సంధించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. తనపై అనర్హత వేటు వేసేందుకు చేస్తున్న పనులను.. గజనీ దండయాత్రలుగా పోల్చారు. తన పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించడానికి విఫలయత్నాలు చేస్తున్నారనేది జగద్విదితమన్నారు. ఇప్పటికి ఏడు సార్లు తనపై అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు వివిధ సందర్భాలలో వినతి పత్రాలు సమర్పించారని లేఖలో పేర్కొన్నారు. నిజానిజాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నా, ఈ అంశానికి సంబంధించి తాము చేయాల్సింది చేస్తామని చెప్పినప్పటికీ కూడా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చట్ట సభల చైర్‌లను దూషించడాన్ని గమనించి ఉంటారని.. యధా రాజా తధా మంత్రి అన్నట్లు, విజయసాయి రెడ్డి కచ్చితంగా తమ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తులపైనా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసినట్లుగానే.. అత్యున్నతమైన, గౌరవప్రదమైన వ్యవస్థలపైన విజయసాయిరెడ్డి పలు దఫాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారని.. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని ఆయన లోక్‌సభ స్పీకర్‌ను నేరుగా హెచ్చరించే సాహసానికి కూడా ఒడిగట్టారని అన్నారు. లోక్‌సభ స్పీకర్‌ను ఉద్దేశించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు విజయసాయిరెడ్డిపై ఇప్పటికే సభాహక్కుల ఉల్లంఘన నోటీసును తాను ఇచ్చానని తెలిపారు.
మీ బృందం చేస్తున్న ఈ చర్యలను పత్రికలలో చదివిన తర్వాత సాధారణ ప్రజలు సైతం ప్రజాసమస్యల పట్ల తమకు ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్న ఒక ప్రశ్నను సీఎం జగన్‌కు సంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీ బృందం, ఎందుకు సభలను స్తంభింపచేయడం లేదని ప్రశ్నించారు. స్పెషల్ క్యాటగిరి స్టేటస్ పై చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు.. మన పార్టీకి అనూహ్యమైన మెజారిటీని కట్టబెట్టారని.. ఒక సహచర ఎంపిపై అనర్హత వేటు వేయించేందుకు పార్లమెంటును స్తంభింప చేసే శక్తి ఉంటే.. అదే శక్తిని మన రాష్ట్రానికి ప్రత్యేక క్యాటగిరి స్టేటస్ తెప్పించేందుకు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.
కనీసం ఈ లేఖను చదివిన తర్వాతైనా మీరు రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నానని రఘురామ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనే అంశం ప్రాముఖ్యతను కూడా మీరు గుర్తిస్తారని.. మీ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యయుత విధానాలు అమలు చేయడం కూడా అనివార్యమని తెలుసుకోవాలని సూచించారు. అదే విధంగా ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పూర్తిగా అవగాహన చేసుకుని జాగ్రత్తలు తీసుకుని ఇక నుంచి బాధ్యతతో మెలుగుతారని కూడా ఆశిస్తున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com