Raghu Rama Krishna Raju :జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ..!

Raghu Rama Krishna Raju : ఔరంగజేబు జిజియా పన్ను విధించినట్టు.. ఏపీలో కూడా పన్నులు వసూలు చేస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారంటూ మరో లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఔరంగజేబు కనీసం మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులను పన్ను నుంచి మినహాయించారని, జగన్ మాత్రం ఎవరిని వదలకుండా అందరిపై పన్ను భారం వేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలపై వేస్తున్న పన్నుల భారాన్ని తగ్గించాలని సూచించారు.
రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే.. జగన్ మాత్రం వాటిపై బిల్లు వేయడమే కాకుండా అదనపు స్లాబ్‌లు వేసి వసూలు చేస్తున్నారని విమర్శించారు. జగనన్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు నెలకు 800 నుంచి 1200 అందితే.. అందులో వెయ్యి రూపాయలు తిరిగి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని లేఖలో కామెంట్ చేశారు. 375 చదరపు అడుగుల ఇరుకు ఇంట్లో ఉన్నవారికి కూడా 50 రూపాయల ఆస్తి పన్ను వేయడం ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.
క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో ప్రతి ఇంటిపై 30 రూపాయల చెత్త పన్ను వసూలు చేసే బదులు.. చెత్త ద్వారా విద్యుత్ తయారీ యూనిట్లను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, చెత్త పన్ను వేయాల్సిన అవసరమే రాదని సూచించారు. ప్రతి ఆటో డ్రైవర్‌కి పది వేలు ఇచ్చి... పెట్రోల్, డీజిల్‌పై గత ప్రభుత్వం ఇచ్చిన 2 రూపాయల రాయితీని తీసేశారని కామెంట్ చేశారు.
రవాణా శాఖ ద్వారా కూడా పన్నులు పెంచి అదనపు ఆదాయ సమకూర్చుకుంటున్నారని అన్నారు. ఓవైపు రెవిన్యూ లోటును తగ్గిస్తున్నాం అంటూనే ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచడం ఏంటని ప్రశ్నించారు. బైబిల్‌లో చెప్పినట్లుగానైనా ఆదాయంలో కొంత భాగాన్ని ప్రజలు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. మధ్యతరగతి ప్రజలను పన్నుభారం నుంచి కాపాడాల్సిందిగా వేడుకుంటున్నా అంటూ ఎంపీ రఘురామ జగన్‌కు లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com