Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ పై రౌడీ షీట్

Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ పై రౌడీ షీట్

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( Pinnelli Ramakrishna Reddy ), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామి రెడ్డిల ( Pinnelli Venkatarami Reddy ) పై పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు గురజాల డి.ఎస్.పి శ్రీనివాసరావు తెలిపారు. పిన్నెల్లి బ్రదర్స్ ఇరువురిపై మొత్తం 14 కేసులు నమోదయినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యం లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామి రెడ్డిలపై రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు.

పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గంలో సార్వత్రిక ఎన్నికల రోజు రెంటచింతల మండలం పాల్వాయి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం సంచలనం రేపింది. అదే రోజున మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి పలు మండలాలలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాల్వాయి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అక్కడున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పిన్నెల్లి వర్గీయులు నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారు. నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మారణాయుధాలతో తనపై దాడి చేశారని.. వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో టీడీపీ ఏజెంట్ నోముల మాణిక్యాల రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు 307 సెక్షన్ కింద మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కారంపూడిలో వందల మంది అల్లరి మూకలతో రోడ్లపై స్వైర విహారం చేస్తూ పలు విధ్వంసాలు సృష్టించడం కూడా కేసు నమోదులో భాగంగా ఉంది.

Tags

Next Story