Schools Reopen : ఏపీలో నేడు స్కూళ్లు రీఓపెన్

ఏపీలో వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యా కానుకను స్టూడెంట్ కిట్ పేరుతో విద్యార్థులకు టీచర్లు అందించనున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పీఎం -పోషణ్ గోరుముద్ద పేరుతో అమలు చేస్తారు. పాఠశాలలు నిన్నే రీఓపెన్ కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో టీచర్ సంఘాల విజ్ఞప్తితో సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12వ తేదీతో ముగిశాయి. . రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో మరో 1225 పాఠశాలలు ఉన్నాయి.
ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్ –తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో సహా 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందించారు. ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్‌ను ఇచ్చారు. ఇక విద్యా సంవత్సరానికి కూడా 36 లక్షల మంది విద్యార్థులకు గతేడాది మాదిరిగానే అందించేందుకు విద్యాకిట్‌లు సిద్ధంగా ఉన్నా జూన్ 20 తర్వాతే విద్యార్థులకు అవి అందే అవకాశం ఉంది. ఈ ఏడాది వెయ్యి ప్రభుత్వ సీబీఎస్‌ఈ స్కూళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికీ కలిపి కొత్త విద్యా క్యాలెండర్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com