ROJA: రోజాపై సంచలన అవినీతి ఆరోపణలు

ROJA: రోజాపై సంచలన అవినీతి ఆరోపణలు
రూ. 40 లక్షలు తీసుకున్నారన్న అదే పార్టీ కౌన్సిలర్‌... వీడియో సాక్ష్యం ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై.. అదే పార్టీకి చెందిన కౌన్సిలర్‌ సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా మీడియా సమావేశంలో బయటపెట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరు పురపాలక ఛైర్‌ పర్సన్‌ పదవి ఇప్పిస్తామంటూ మంత్రి ఆర్కే రోజా... తమ నుంచి 40 లక్షల రూపాయల డబ్బు తీసుకుని మోసం చేశారని 17వ వార్డు కౌన్సిలర్‌ ఎస్‌.భువనేశ్వరి ఆరోపించారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆమె దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏకగ్రీవంగా తాను ఎన్నిక కావడంతో ఛైర్‌పర్సన్‌ పదవి తనకే ఇస్తానని మంత్రి ఆర్కే రోజా చెప్పారని భువనేశ్వ రి ఆరోపించారు. మంత్రి ఆర్కే రోజా సోదరుడు కుమారస్వామిని సంప్రదించగా రూ.70 లక్షలు డిమాండ్‌ చేశారని తెలిపారు.


అప్పుచేసి మూడు విడతల్లో 40 లక్షల రూపాయలను ఆయనకు రోజా సోదరుడికి సన్నిహితంగా ఉండే సత్య అనే వ్యక్తికి ఇచ్చామని భువనేశ్వరి తెలిపారు. తమ ఇంట్లోనే ఇచ్చిన రూ.20 లక్షలకు ఆధారాలు ఉన్నాయంటూ ఈ సందర్భంగా డబ్బును అందజేస్తున్న వీడియోను ఆమె ప్రదర్శించారు. డబ్బులు తీసుకుని మరొకరికి పదవిని ఇవ్వడంపై ప్రశ్నిస్తే రెండేళ్లు వేచి ఉండాలని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత సమయాన్ని పొడిగించుకుంటూ పోయారని.... అటు పదవి ఇవ్వక... ఇటు డబ్బులు అడిగితే ఇవ్వక తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని భువనేశ్వరి ఆరోపించారు. ఇప్పుడు అడిగితే సాధారణ ఎన్నికలు ముగిశాక చూద్దామంటున్నారని వాపోయారు. మంత్రి రోజాకి ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. కనీసం డబ్బు తిరిగివ్వమన్నా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. చివరకు రూ.29 లక్షలే ఇస్తామని చెప్పారని, అందుకు అంగీకరించినా స్పందించడం లేదని వాపోయారు. డబ్బు గురించి ఎవరికైనా చెబితే ఇబ్బంది పడాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని వాపోయారు. సమావేశంలో భర్త సుబ్రహ్మణ్యం, కుమారుడు చరణ్‌, బంధువులు పాల్గొన్నారు.


మరోవైపు మంత్రి రోజాను నగరి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటిస్తే తాము పనిచేయబోమని ఆ నియోజకవర్గంలోని వడమాలపేట, నిండ్ర జడ్పీటీసీ సభ్యులు మురళీధర్‌రెడ్డి, మల్లీశ్వరి స్పష్టం చేశారు. చిత్తూరులో వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి తమను ఇబ్బందిపెడుతూ కక్ష సాధిస్తున్నారని, అభివృద్ధి పనులకు కేటాయించిన జడ్పీ నిధులకు ప్రొసీడింగ్స్‌ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story