SHARMILA: సిద్ధం సభలకు రూ.600 కోట్లు

SHARMILA: సిద్ధం సభలకు రూ.600 కోట్లు
ప్రజల సొమ్ము దోచేస్తున్న వైసీపీ... ఎవరి సొమ్ముని ఖర్చు చేస్తున్నారన్న షర్మిల

సిద్ధం సభలతో ప్రభుత్వ సంపదను వైసీపీ దోచుకుంటోందని ఏపీ పీపీసీ అధ్యక్షురాలు వై.ఎస్ . షర్మిల ఆరోపించారు. ఒక్కో సిద్ధం సభకు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని సభలకు కలిపి 600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ఇదంతా ఎవరి డబ్బని షర్మిల ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ చాలావాటిని మరిచిపోయారని ఆమె ఆరోపించారు. ప్రధానంగా 2.3 లక్షల ఉద్యోగాలు భర్తిచేస్తామన్న జగన్ ఆ మాటే మరిచారని ఆక్షేపించారు. ఇక డీఎస్సీ అభ్యర్థులను దారుణంగా మోసం చేశారని షర్మిళ మండిపడ్డారు. ఈ వైఖరిపై...... నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలను ప్రభుత్వం అణచివేస్తోందని షర్మిళ ధ్వజమెత్తారు.


‘‘గత ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇచ్చిన మాట మరిచారు. 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ వేశారు. కావాల్సిన వాళ్లకే వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలపై మేం నిలదీస్తే తీవ్రవాదుల్లా చూశారు. గృహనిర్బంధాలు, అరెస్టులు చేశారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారు. కేంద్రంలో భాజపా 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ, ఇవ్వలేదు’’అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల మండిపడ్డారు. తాను ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై చర్చ జరిగిందని, అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

మరోవైపు మేదరమెట్ల సిద్ధం సభలోనూజగన్ అబద్ధాల విషపు జల్లు కురిపించారని... తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. హామీలు నిలబెట్టుకున్నానన్న జగన్ మాట పచ్చి అబద్ధమని మండిపడ్డారు. 85శాతం హామీలు అమలు చేయకుండా మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమానికి బడ్జెట్ లో జగన్ 15శాతం ఖర్చు చేయగా.. చంద్రబాబు 19శాతం ఖర్చు చేశారని గుర్తుచేశారు. జగన్ కల 10 లక్షల కోట్ల దోపిడీ, జిల్లాకొక సొంత ప్యాలెస్ నిర్మాణమని ఆక్షేపించారు. ప్రజా విశ్వాసం కోల్పోయినందుకే... సభకు నిండా లక్ష మంది కూడా రాలేదన్నారు. మద్యపానాన్ని నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్, మాట తప్పారని మండిపడ్డారు. . ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story