Sharmila : రేవంత్‌తో షర్మిల భేటీ.. వైఎస్ జయంతి వేడుకలకు ఆహ్వానం

ఈ నెల 8న విజయవాడలో జరిగే దివంగత -ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులను వైఎస్ కూతురు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానించారు. రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులను కూడా ఆమె స్వయంగా ఆహ్వానించారు.
మంగళవారం ఉదయం జూబ్లీ హిల్స్ లోని సీఎం -నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా షర్మిలకు రేవంత్ శాలువ కప్పి సన్మానించారు. ఆ తర్వాత ప్రజాభవన్లో మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కతో పాటు ఆయన సతీమణి నందిని మల్లు షర్మిలను సాదరంగా ఆహ్వానించి కొద్ది సేపు మాట్లాడారు. వైఎస్ తనకు ఉన్న అనుబంధాన్ని భట్టి వివరించారు. ఆ తర్వాత.. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసానికి వెళ్లి ఆయనను విజయవాడలో జరిగే జయంతి సభకు రావాలని కోరారు.
తొలిసారి తమ నివాసానికి వచ్చిన షర్మిలకు పొన్నం సతీమణి సంప్రదాయబద్ధంగా బొట్టుపెట్టి ఆహ్వానం పలికారు. జయంతి కార్యక్రమానికి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు వైఎస్ఆర్ స్నేహితులను కూడా షర్మిల ఆహ్వానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com