Jogi Ramesh : ప్రమాణాలు చేస్తే అరెస్టు చేయొద్దా..?

Jogi Ramesh : ప్రమాణాలు చేస్తే అరెస్టు చేయొద్దా..?
X

ఏపీలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసులో అందరూ ఊహించినట్టే జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. సిట్ అధికారులు ముందు నుంచే ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది అని చెప్పే అనేక సాక్షాలను బయటకు వదిలారు. జనార్దన్ రావుతో జోగి రమేష్ కలిసి తిరిగిన వీడియోలు, ఇద్దరూ మాట్లాడుకున్న ఫోటోలు, జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ను వీడియో తీసి బయటకు వదిలారు. అంటే ఇందులో ఎవరు ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ మీద కేసులు పెట్టట్లేదని.. తప్పు జరిగింది కాబట్టి.. సాక్షాలు పక్కాగా ఉన్నాయి కాబట్టే ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు సిట్ అధికారులు సంకేతాలు ఇస్తూ వచ్చారు. జనార్దన్ రావు ఎప్పుడైతే జోగి రమేష్ పేరు చెప్పాడో.. అప్పుడే సెంటిమెంట్ రాజకీయానికి తెరతీసాడు జోగి. నేరుగా వెళ్లి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసేశాడు.

తనకేం సంబంధం లేదని.. తనకు అసలు జనార్దన్ రావు అంటే ఎవరో తెలియదని.. తనను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా టార్గెట్ చేసిందంటూ సత్యహరిశ్చంద్రుని రేంజ్ లో బిల్డప్ ఇచ్చేశారు. అయితే ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అయిన తర్వాత.. మీడియా ముందు చిందులేశారు. తాను కుటుంబంతో సహా ఆలయంలో ప్రమాణం చేశానని.. అయినా సరే అరెస్టు చేయడం అక్రమం అన్నారు. అంటే ఆయన ఉద్దేశంలో ప్రమాణం చేస్తే ఎంతటి తప్పు చేసినా సరే అరెస్టు చేయొద్దనా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి.. ఒక ప్రమాణం చేసేస్తే చేసిన పాపాలన్నీ పోతాయా.. ఇదేం దిక్కుమాలిన రాజకీయం. రేపటి నుంచి తప్పులు చేసిన వారంతా ఆలయాలకు వెళ్లి ప్రమాణాలు చేసేస్తే.. పోలీసులు వదిలిపెట్టాలా.. ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవాలా.

అసలు జోగి రమేష్ కు ఎలాంటి సంబంధం లేకపోతే జనార్దన్ రావు ఒక్క జోగి రమేష్ పేరు మాత్రమే ఎందుకు చెప్పాడు. జనార్దన్ రావును జోగి రమేష్ ఎప్పుడూ కలవకపోతే ఆ వీడియోలో ఉన్నది ఎవరు.. అంటే ప్రజలను మరీ అంత అమాయకులు అనుకుంటున్నారా. ఏం చెప్పినా నమ్మేస్తారు.. ఓ ప్రమాణం చేసేస్తే తప్పు చేయలేదని ప్రజలు అనుకుంటారు అని జోగి రమేష్ భ్రమ పడటం నిజంగా ఆయన అమాయకత్వమే. ఏ ప్రమాణాలు చేసినా సరే.. తప్పు ఉందో లేదో తేల్చాల్సింది సిట్. విచారణలో అన్ని బయటపడతాయి కదా. ఒకవేళ జోగి రమేష్ తప్పు చేయకపోతే విచారణలో తేలిపోతుంది కదా. అప్పుడు తాను కడిగిన ముత్యమని ఆయనే చెప్పుకోవచ్చు కదా. ఆ పని చేయకుండా విచారణకు కూడా ఎందుకు సహకరించట్లేదు. తప్పు చేయకపోతే భయం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు.

Tags

Next Story