Heat Stroke : వడదెబ్బతో ఆరుగురి మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త

Heat Stroke : వడదెబ్బతో ఆరుగురి మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త

తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు 46 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ తగిలి రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. ఇవాళ, రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు, పలు జిల్లాల్లో వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల 6, 7 తేదీల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది.

శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్‌ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలలో 46.7 డిగ్రీలు నమోదైంది.

ఆసిఫాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు ఏపీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇవాళ నంద్యాల జిల్లా గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7, ప్రకాశం జిల్లా అర్దవీడులో 47.3, వైఎస్సార్ జిల్లా చిన్నచెప్పలిలో 47.2, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీలు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు హడలెత్తించాయి. కాగా రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాలులు, 169 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story