VOTES: ఏపీలో ఓట్ల అవకతవకలు

VOTES: ఏపీలో ఓట్ల అవకతవకలు
ఓటర్ల జాబితాలో కొనసాగుతున్న అవకతవకలు.... ఓటర్ల జాబితాల్లో అనేక తప్పులు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఓటర్ల జాబితాల్లో అనేక తప్పులు వెలుగుచూశాయి. వాలంటీర్ల సాయంతో ఓటర్ల సవరణ ప్రక్రియను B.L.O లు తూతూమంత్రంగా ముగించడంతో పలు నియోజకవర్గాల్లో జాబితాలు లోపాల మయంగా మారాయి. అనేక చోట్ల మృతుల పేర్లను జాబితాల నుంచి తొలగించలేదు. అభ్యంతరాలపై దృష్టి సారించలేదు. కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆగస్టు 22 నుంచి అక్టోబరు 22 వరకు రెండు నెలల పాటు B.L.O లు ఓటర్ల జాబితాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఓటర్ల మార్పులు, చేర్పులు, తొలగింపులు లాంటి సవరణలు చేపట్టాలి. B.L.O లు ఇంటింటికీ తిరగకుండా సచివాలయాల్లో కూర్చుని వాలంటీర్లు ఇచ్చిన ఆదేశాలను పాటించారనే విమర్శలు ఉన్నాయి. అక్టోబరు 27న ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఇది ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి అభ్యంతరాలు స్వీకరించారు. అయినా వాటిపై స్పందన రాలేదు. తిరిగి డిసెంబరు 3, 4 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబరు 26 నాటికి అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 5నాటికి తుది జాబితా ప్రకటిస్తారు. ఇదే తుది జాబితా...దీనితోనే ఎన్నికలకు వెళతారు. ఈ జాబితాలో ఓటు హక్కు ఉంటేనే వినియోగించే అవకాశం ఉంటుంది. లేకపోతే కోల్పోయినట్లే.


కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా బందరు, పెనమలూరు నియోజకవర్గంలో అభ్యంతరాలు వచ్చాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో 25 వేల బోగస్‌ ఓట్లు ఉన్నట్లు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గంలో దాదాపు 15వేల ఓట్లు పక్క నియోజకవర్గం నుంచి చేర్పించారని, వీటిని తొలగించాలని, డబుల్‌ ఎంట్రీ ఓట్లు 10వేల వరకు ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత దొర్లిన తప్పులుగా వీటిని పేర్కొంటున్నారు. అంటే మచిలీపట్నంలో ఓటర్ల జాబితా సవరణ సక్రమంగా జరగలేదని మాజీ మంత్రి అంగీకరిస్తున్నట్లే కదా. ఎన్నికల సంఘం అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా జిల్లా స్థాయిలో అడ్డుపడిన అదృశ్య హస్తం ఎవరనే చర్చ సాగుతోంది. గన్నవరం నియోజకవర్గం పరిధి రామవరప్పాడులో దాదాపు 500 ఓట్లు నమోదయ్యాయి. ఇవి మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలోనూ ఉన్నాయి. వీటిపై మైలవరం నియోజకవర్గానికి చెందిన తెదేపా నాయకుడు పద్మాశేఖర్‌ ఫిర్యాదు చేసినా స్పందన లేదు.

Tags

Next Story