JAGAN: గుడ్లవల్లేరుపై స్పందించిన జగన్... జెత్వానీపై స్పందించరా..?
గుడ్లవల్లేరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది. చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గాలికొదిలేశారు’ అంటూ సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ ఆంశంపై బాగానే ఉంది. కానీ ముంబై నటి కాదంబరీ జెత్వాని విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు..? అనే ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
నటి కన్నీటి పర్యంతం
మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో కాదంబరీ జెత్వాని ఎపిసోడ్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె విజయవాడ సీపీ కార్యాలయానికి చేరుకుని తనపై జరిగిన అమానవీయ చర్యలను చెబుతూ కన్నీటి పర్యంతం అయింది. వైసీపీ హయాంలో ఐపీఎస్ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని, ఆమె కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని ఆమె వాపోయింది. పోలీసులు కిడ్నాప్ చేసి , 40 రోజులపాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారని తెలిపింది. న్యూడ్గా చేసి వీడియోలు తీసి బెదిరించారని నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ వణికిపోయింది. దీని వెనుక ఉన్న పెద్ద నాయకులు గురించి చెప్పి తనకు న్యాయం చేయాలని కోరింది.
ఈ ఘటనపై మాటలు రావడం లేదేం..
ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖండించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఈ అంశంపై స్పందించలేదు. స్వయంగా ఆయన సలహదారు, నమ్మిన బంటు, అనుంగు అనుచరుడైన సజ్జలపై ఆరోపణలు వస్తోన్న నాటి సీఎం నుంచి మాట మాత్రమైనా రావడం లేదు. కానీ, గుడ్లవల్లేరు ఘటనపై మాత్రం ఎక్స్ వేదికగా స్పందించారు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో బాధితులు అమ్మాయిలే.. అదే సమయంలో ఇక్కడ ఐపీఎస్ అధికారుల, వైసీపీ నాయకుల చిత్రహింసలకు గురై బాధితురాలుగా నిలిచింది ఓ మహిళే.. అమ్మాయిలకు భద్రత కల్పించాలని కామెంట్స్ చేస్తోన్న జగన్..జెత్వాని విషయంలో మాత్రం న్యాయం చేయాలని డిమాండ్ చేయకపోవడం పట్ల ఇప్పుడు చర్చ జరుగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com