YCP: వైసీపీలో మంత్రి పదవుల చిచ్చు.. పలుచోట్ల నిరసనలు..

YCP: వైసీపీలో మంత్రి పదవుల చిచ్చు.. పలుచోట్ల నిరసనలు..
X
YCP: వైసీపీలో మంత్రి పదవుల చిచ్చు తారస్థాయికి చేరింది. పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

YCP: వైసీపీలో మంత్రి పదవుల చిచ్చు తారస్థాయికి చేరింది. పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అటు.. తమ నేతలకు మంత్రి పదవులు దక్కలేదని అనుచరులు, అభిమానులు రోడ్డెక్కారు. మనస్తాపంతో పలు చోట్ల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు సైతం రాజీనామాలకు సిద్ధమయ్యారు.

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై.. ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పదవి రాలేదని కోటంరెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ పదవులు వదులుకునేందుకు సిద్ధమయ్యారు 26మంది కార్పొరేటర్లు, 18 మంది సర్పంచులు, 12 మంది MPTCలు.

అటు.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కేడర్‌ భగ్గుమంది. పార్టీ శ్రేణులు, పిన్నెల్లి అనుచరులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. రెంటచింతలలో ప్రధాన రహదారిపై నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. మాచర్ల నియోజకవర్గ మహిళానేత సంపూర్ణమ్మ ఆత్మహత్యాయత్నం చేయడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మంటల్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంపూర్ణమ్మను తోటి కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌కు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు అతని చొక్కా విప్పేసి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మాచర్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు సమావేశమై రాజీనామాలు సిద్ధం చేశారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

పిన్నెల్లికి మంత్రి పదవి కేటాయించకపోవడంపై మాచర్ల పట్టణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌తో పాటు 30 మంది కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అంతా రాజీనామాకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలోనూ మంత్రి పదవుల రచ్చ ఓ రేంజ్‌లో ఉంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు.

అయితే, జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉదయభాను అనుచరులు సైతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.. బోశెట్టి త్రినాథ్‌ ఆధ్వర్యంలో రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వలేదని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీంతో పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంతో వివిధ రూపాల్లో నిరసనల తెలుపుతున్నారు.

Tags

Next Story