TDP: మోదీ సభలో మైక్ సమస్య వెనుక పోలీసుల కుట్ర

TDP: మోదీ సభలో మైక్ సమస్య వెనుక పోలీసుల కుట్ర
సభాసమయం వరకు స్టేజ్‌ పాస్‌లు ఇవ్వలేదన్న టీడీపీ... పల్నాడు ఎస్పీ కుట్రపూరితంగా వ్యవహరించారన్న ప్రత్తిపాటి పుల్లారావు

ప్రజా గళం సభ నిర్వహణలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా వైఫల్యం చెందినట్లు కనిపిస్తుందనితెలుగుదేశం నేతలు ఆరోపించారు. మైకుల వద్ద గుమ్మిగూడిన వారిని నియంత్రించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పోలీసుల తీరుపై ప్రధాని మోదీ సైతం అసహనం వ్యక్తం చేశారని వెల్లడించారు. ప్రధానికి వేదికపైన, తిరిగి వెళ్లేటప్పుడు జ్ఞాపికలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు తెచ్చిన దేవుడి ప్రతిమను అనుమతించని భద్రతా సిబ్బంది, పవన్ ఇవ్వాలనుకున్న చందనమాల, దేవుడి ప్రతిమకూ అనుమతి నిరాకరించారని తెలిపారు.ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేశామని తెలుగుదేశం నేతలు తెలిపారు.


బొప్పూడి సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా ప్రధాని మోదీ మధ్యలో జోక్యం చేసుకొని....లైటు స్తంభాల నుంచి దిగిపోవాలని.....అభిమానులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అభిమానంతో తమ కోసం వచ్చిన ప్రజల ప్రాణాలు ఎంతో విలువైనవని.... కరెంటు తీగలకు దూరంగా ఉండాలని కోరారు. పొరపాటున ప్రమాదం జరిగితే చాలా బాధ కలిగిస్తుందని... అలాంటి పరిస్థితికి తావివ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. తక్షణమే లైట్ స్తంభాలను ఎక్కిన వారిని దించాల్సిందిగా పోలీసులకు నిర్దేశించారు. మోదీ మాట మేరకు అభిమానులు వెంటనే స్తంభాలపై నుంచి దిగిపోయారు.


మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ రాత్రి పగలు కష్టపడుతున్నారని అన్నారు. కోటప్పకొండ నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్టు భావిస్తున్నానని ప్రధాని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే తాను ఆంధ్రప్రదేశ్‌కు వచ్చానని అన్నారు. మూడవ సారి అధికారంలోకి వస్తే దృఢమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈసారి జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. అభివృద్ది చెందే దేశానికి, ఆంధ్రప్రదేశ్‌‌కు 400 సీట్లు అవసరం అని అన్నారు. ఎన్డీయే పొత్తులో స్థానిక ప్రజలు ఆకాంక్షలు, జాతీయ వృద్ధి రెండింటినీ కలిసి తీసుకువెళతామన్నారు. ఎన్డీయే బలం మరింత పెరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఇద్దరు చాలా కాలం నుంచి ఏపీ వికాసం కోసం రాత్రి పగలు పనిచేస్తున్నారని, ఎన్డీయే లక్ష్యం వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామన్నారు. భాగస్వాములు పెరగడం వల్ల ఎన్డీయే బలం మరింత పెరుగుతోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story