TDP_NDA: త్వరలోనే ఎన్డీఏలోకి టీడీపీ? జాతీయ మీడియాలో కథనం..

TDP_NDA: త్వరలోనే ఎన్డీఏలోకి టీడీపీ? జాతీయ మీడియాలో కథనం..
TDP_NDA: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ మరోసారి జతకట్టబోతోందా?

TDP_NDA: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ మరోసారి జతకట్టబోతోందా? వచ్చే దసరా, దీపావళి నాటికి ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ చేరబోతోందా? ఎన్డీఏలో టీడీపీ చేరికపై జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే, గ్రౌండ్‌ ప్రిపరేషన్‌ మొత్తం జరిగిపోయిందని, చేరికపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందనే రీతిలో వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ-ఎన్డీఏ మధ్య కొత్త పొత్తు పొడుస్తుందా లేక పాత పొత్తు కొనసాగుతుందా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీడీపీ-బీజేపీ పొత్తుపై ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ ఎడిషన్‌ ఆసక్తికర కథనం ఇచ్చింది. మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడారు. కాని, ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా మాట్లాడారని వార్త ఇచ్చింది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుపై రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని, ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమీ కపూర్‌ సైతం టీడీపీ-బీజేపీ పొత్తుపై వ్యాఖ్యానం చేశారు. దశాబ్దాలుగా ఢిల్లీలో అనేక మంది సీనియర్ రాజకీయ నేతలతో జర్నలిస్ట్‌ కుమీ కపూర్‌కు పరిచయాలు ఉన్నాయి. అత్యంత లోతుగా రాజకీయ విశ్లేషణలు చేయడంలోనూ, పార్టీల అంతర్గత విషయాలను బయటపెట్టడంలోనూ జర్నలిస్ట్‌ కుమీ కపూర్‌కు అపారమైన అనుభవం ఉంది. మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానిని కలిసి సమయంలోనే.. నారా లోకేష్‌ సైతం అమిత్‌షాను కలిశారని కుమీ కపూర్‌ వెల్లడించారు.

బీజేపీ-టీడీపీ పొత్తు అనేక కోణాల్లో ప్రభావం చూపిస్తుందని సీనియర్ జర్నలిస్ట్ కుమీ కపూర్‌ చెప్పుకొచ్చారు. బీజేపీకి టీడీపీ క్రమంగా దగ్గరవుతోందంటూ ఇప్పటికే ఏపీ రాజకీయాల్లోనూ, అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ఈ కథనాలకు బలాన్నిస్తూ.. ఈ మధ్య మునుగోడు సభకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. వెళ్తూ వెళ్తూ హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు, ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఇవన్నీ టీడీపీ-ఎన్డీఏ పొత్తు గురించి జరిగినవేనన్న చర్చ జరుగుతోంది.

అమిత్‌షాతో రామోజీరావు, ఎన్టీఆర్‌ మధ్య జరిగిన సమావేశంలో ఏపీ రాజకీయాలపైనే ప్రధాన చర్చ జరిగిందని తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు సైతం మాట్లాడుకుంటున్నారు. అమిత్‌షా రామోజీరావును కలవడం, ఆ తరువాత ఎన్టీఆర్‌ను కలవడంతో వైసీపీలో కలవరపాటు మొదలైందని పొలిటికల్‌ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో చంద్రబాబు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడంతో వైసీపీ కలవరపడిందనే టాక్‌ కూడా వినిపించింది. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏలోకి టీడీపీ చేరుతోందన్న వార్త వైసీపీని మరింత కంగారుపెడుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story