AP: నేడే కూటమి నేతల మేనిఫెస్టో

AP: నేడే కూటమి నేతల మేనిఫెస్టో
ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.....రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో మేనిఫేస్టో

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.....రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను నేడు విడుదల చేయనుంది. పన్ను బాదుడు లేని సంక్షేమం – ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కాదని సంపద సృష్టించే సంక్షేమం అందిస్తామనే హామీని కూటమి ప్రజలకు ఇవ్వనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రూట్‌మ్యాప్‌తో మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసంలో పవన్‌, బీజేపీ నేతల సమక్షంలో నేటి మధ్యాహ్నం మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.


సూపర్‌సిక్స్‌ హామీలైన సామాజిక పింఛన్లు 4వేల రూపాయలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ప్రజల దృష్టిని ఆకర్షించిన NDA కూటమి...నేడు పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. రాజమహేంద్రవరంలో 11 నెలల క్రితం నిర్వహించిన మహానాడులోనే సూపర్‌సిక్స్‌ పేరిట మినీ మ్యానిఫెస్టోను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. జనసేనతో పొత్తు ఖరార్యయాక...మరికొన్ని హామీలు జోడించింది. భాజపాతో జట్టు కట్టిన తర్వాత మూడు పార్టీల నేతలు ఉమ్మడి మ్యానిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ‘నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం’ అంటూ తుది రూపు నిచ్చారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోని పథకాలను వైకాపా రద్దు చేయగా...వాటిని తిరిగి పునురద్ధరించే అవకాశం ఉంది. అన్న క్యాంటీన్‌లు, పండుగ కానుకలు తిరిగి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘అధిక పన్నులు, భారాల బాదుడు లేని సంక్షేమం- ప్రతి ప్రాంతంలో అభివృద్ధి’ అన్నది ప్రధానాంశంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు సమాచారం.

ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో చంద్రబాబు, పవన్‌ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేయటంతో తో పాటు సామాజిక పింఛను 4 వేలకు పెంచి వాటిని ఈ ఏప్రిల్‌ నుంచే వర్తించేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నగదున కూడా ఇంటి వద్దే అందజేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు పింఛను 6 వేలకు పెంచటంతో పాటు బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15 వందలు చొప్పున ఏడాదికి 18 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల చొప్పున భృతి ప్రకటించారు. ‘తల్లికి వందనం" కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి 20 వేల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు వాలంటీర్ల గౌరవ వేతనం 10 వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు. ఇవన్నీ మ్యానిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story