YS Viveka Case: రంగయ్యకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: చంద్రబాబు

Chandra babu Comments on Ys Viveka Death Case

Chandra babu File Photo 

YS Viveka Case: పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని పిలుపునిచ్చారు.

YS Viveka Case: పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి వరద ముంపు, వర్షాల వల్ల ఏజెన్సీల్లోని ఆదివాసీలు, ప్రజలు..తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయారని.. పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించి ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని మండిపడ్డారు. బాధితులందరికీ వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని.. టిడ్కో గృహాల్ని వెంటనే లబ్దిదారులకు అందించాలని స్పష్టం చేశారు.

సీఎం రాయలసీమకు చేస్తున్న ద్రోహంపై కర్నూలులో పార్టీ రాయలసీమ, నెల్లూరు జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశం విజయవంతమైందని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాలు, ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అటు.. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించేందుకు సిద్ధమని ప్రకటించామని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం చేసిన మోసంపై తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఉద్యోగాలివ్వాలంటూ రోడ్డెక్కిన యువతపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలన్నారు చంద్రబాబు.

ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం అన్న జగన్.. అధికారంలోకి వచ్చాక అసలు సీబీఐ దర్యాప్తే అవసరం లేదన్నారని..ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు సుపారీ ఇచ్చినట్లు వాచ్ మన్ రంగయ్య చెప్పడంతో..జగన్ అండ్ కో గుండెల్లో వణుకు మొదలైందన్నారు. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తిని హత్య చేసేందుకు 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చేంత అవసరం ఎవరికి ఉందో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇన్ని నెలలైనా ఎందుకు తెలుసుకోలేదని ప్రశ్నించారు. పరిటాల రవి హత్యలో సాక్షుల్ని హత్య చేశారని.. వివేకా హత్య కేసులో ఉన్నవారు కొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు.

రంగయ్యకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని.. రంగయ్యకు ఏమైనా జరిగితే జగన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకుని వేల కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు మద్య నిషేధం మాట పక్కన పెట్టి బలవంతంగా మద్యం తాగిస్తున్నారు.. తాగుబోతుల్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారన్నారు. ప్రజా వేదిక కూల్చివేత, ఐకానిక్ బ్రిడ్జి బేస్ కూల్చివేత, రోడ్ల ధ్వంసం అత్యంత దుర్మార్గమని..వైసీపీ దొంగలు రోడ్లను తవ్వి.. గ్రావెల్ తరలిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ఆరుగాలం శ్రమించే రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా..జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. రబీ సీజనుకు సంబంధించి వేల కోట్ల బకాయిలున్నాయని... ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పక్షం రోజులైనప్పటికీ.. పాత బకాయిలు చెల్లించకపోవడం రైతుల్ని వేధించడమేనన్నారు.ఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతులు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితుల్ని ప్రభుత్వం సృష్టిస్తోందని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story