CBN: ఆల్‌ ది బెస్ట్‌ తమ్ముళ్లూ అంటూ...

CBN: ఆల్‌ ది బెస్ట్‌ తమ్ముళ్లూ అంటూ...
అయిదు స్థానాల్లో మార్పులతో టీడీపీ బీ ఫామ్‌లు... అభ్యర్థులకు అందచేసిన చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే తెలుగుదేశం అభ్యర్థులకు బీ-ఫామ్‌ల పంపిణీ పూర్తయింది. ఆల్‌ ది బెస్ట్‌ తమ్ముళ్లంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందచేశారు. అభ్యర్థులందరూ విజయబావుటా ఎగురవేయాలని స్ఫూర్తి నింపారు. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఐదుగురిని మార్చి వేరొకరిని సర్దుబాటు చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీ-ఫామ్‌ల పంపిణీ ప్రక్రియ సందడిగా సాగింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల్లో కొంతమందిని మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందించిన చంద్రబాబు ఐదు స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు చేర్పులు చేశారు.


ఉండి టిక్కెట్ రఘురామకృష్ణరాజుకి కేటాయించారు. ఆ స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్‌ అధ్యక్షులుగా నియమించారు. నరసాపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడంతో పాటు... ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమన్వయకర్తగా నియమించారు. మాడుగుల టిక్కెట్‌ను బండారు సత్యనారాయణ మూర్తి దక్కించుకోగా..పాడేరు టిక్కెట్‌ను గిడ్డి ఈశ్వరికి అధిష్టానం కేటాయించింది. మడకశిర స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎం.ఎస్. రాజు బరిలోకి దిగనున్నారు. వెంకటగిరి స్థానాన్ని కుమార్తె లక్ష్మీసాయిప్రియ నుంచి తండ్రి కురుగొండ్ల రామకృష్ణకు మార్చారు.


B- ఫామ్‌ల పక్రియకు 13మంది అభ్యర్థులు హాజరుకాలేకపోయారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌, రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు, నరసరావుపేట అభ్యర్థి అరవింద్‌బాబు, విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్‌, చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి ఆనం రాంనారాయణరెడ్డి, పలమనేరు అభ్యర్థి అమర్నాథ్‌రెడ్డి, బనగానపల్లె నుంచి బి.సి.జనార్దన్‌రెడ్డి, తాడిపత్రి అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి, రాప్తాడు అభ్యర్థి పరిటాల సునీత, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవీరెడ్డి ...వివిధ కారణాల వల్ల హాజరుకాలేదు. కడప అభ్యర్థి మాధవీరెడ్డి బదులు ..ఆమె భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరఫున ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బీ-ఫామ్స్‌ తీసుకున్నారు. దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫామ్‌లు పెండింగ్‌లో పెట్టారు. అనపర్తి వ్యవహారంపై స్పష్టత వచ్చాక... దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫామ్‌లు ఇవ్వనున్నారు. అనపర్తి తెలుగుదేశం టిక్కెట్ ఆశించిన నల్లమిల్లి రామకష్ణా రెడ్డి భాజపా తరపున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ అభ్యర్థులతో కలసిఅసెంబ్లీ అభ్యర్థులు అధినేతతో బీ- ఫామ్స్‌ పట్టుకుని ఫొటోలు దిగారు. తొలిసారి B-ఫామ్‌ అందుకున్న అభ్యర్థులు తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story