CBN: అయోధ్యకు చంద్రబాబు

CBN: అయోధ్యకు చంద్రబాబు
రేపు సాయంత్రం బయలుదేరనున్న చంద్రబాబు....తరలివెళ్లనున్న అతిరథ మహారథులు

అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఈనెల 22న జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన 21 సాయంత్రం బయలుదేరనున్నారు. ఆయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఇప్పటికే చంద్రబాబుకు ఆహ్వానం పంపారు.


కేసీఆర్‌కు ఆహ్వానం...

ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానపత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్‌ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


అతిథులు వీరే...

రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన వారిలో రాజ‌కీయ‌, పారిశ్రామిక‌, సినీ, క్రీడా రంగాల‌కు చెందిన ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు ఉన్నారు. శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స‌భ్యులు ప్ర‌ముఖుల నివాసాల‌కు వెళ్లి అయోధ్యలో జరిగే రాముడి మహా వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే సోమవారం జరిగే బృహత్తర కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజ‌రయ్యే అవ‌కాశం ఉంది. పారిశ్రామిక‌వేత్త ముకేశ్ అంబానీ, ఆయ‌న కుటుంబ‌ం, బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చన్‌తో పాటు ప‌లువురు ప్రముఖులు హాజ‌రు కానున్నారు. అమితాబ్ బ‌చ్చన్ ప్రత్యేక ప్రయివేటు చార్టెడ్ ప్లేన్‌లో కుటుంబ స‌భ్యుల‌తో అయోధ్యకు వెళ్లనున్నారు. సినీ ఇండ‌స్ట్రీ నుంచి అజ‌య్ దేవ‌గ‌న్‌, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, మోహ‌న్ లాల్, అనుప‌మ్ ఖేర్, చిరంజీవి, సరోద్ మాస్ట్రో అంజ‌ద్ అలీ ఖాన్‌, గీత రచయిత మ‌నోజ్ ముంతాషీర్, అతని భార్య ప్రసూన్ జోషి, డైరెక్ట‌ర్లు సంజ‌య్ భ‌న్సాల్, చంద్రప్రకాశ్ ద్వివేదితో పాటు ప‌లువురు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story