CBN: నాది విజన్‌.. జగన్‌ది పాయిజన్‌

CBN: నాది విజన్‌.. జగన్‌ది పాయిజన్‌
ఉమ్మడి కర్నూలు, నెల్లూరు జిల్లాలో బాబు ప్రజాగళం సభలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు, తెదేపా నేతలు, కార్యకర్తలు

ప్రజాగళం ప్రచార సభల్లో భాగంగా ఉమ్మడి కర్నూలు, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత బనగానపల్లిలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు... పార్టీ జెండాను ఆవిష్కరించారు. 42 ఏళ్లుగా జెండాను మోస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు... ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ప్రసంగించిన చంద్రబాబు... తాము మధ్యాహ్నం ఎండలో సభలు పెడితే జన ప్రభంజనం కనిపిస్తోందన్నారు. అదే జగన్‌తో పాటు వైసీపీ సభల్లో మాత్రం జనం పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో తమది విజనైతే జగన్‌ది పాయిజన్‌ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు. తిరిగి గాడిలో పెట్టేందుకే NDAలో చేరామని చంద్రబాబు స్పష్టం చేశారు. సొంత బాబాయి హత్య విషయంలో నిందితులను వదిలిపెట్టి నేరాన్ని చెల్లెలిపై నెట్టేందుకు యత్నిస్తున్న జగన్‌ని.... తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న వైసీపీని కూలదోసి తాడేపల్లి ప్యాలెస్‌ని బద్దలు కొట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని కోరారు.


వివేకా హత్యపై జగన్‌ వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్‌ ఇచ్చిన చంద్రబాబు వైసీపీ ఐదేళ్ల పాలనపై తనదైన శైలిలో చురకలు వేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే NDA కూటమిలో చేరామన్న చంద్రబాబు మైనార్టీలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. వైకాపా చేసే మోసాన్ని గ్రహించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విధ్వంస పాలనతో ప్రజల్ని, అహంకారంతో పార్టీ నేతల్ని, రాజకీయాల కోసం కుటుంబాన్ని దూరం చేసుకున్న జగన్‌... ఇప్పుడు అందరూ కలిసి తనపై యుద్ధం చేస్తున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.


తర్వాత కావలి సభలో ప్రసంగించిన తెలుగుదేశం అధినేత... సభకు వచ్చిన జనాన్ని చూస్తే జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయన్నారు. నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి ప్రచారానికి జనాన్ని రమ్మని బతిమలాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలుపు తథ్యమన్న బాబు.... అది తెలిసే ఆయన భార్యపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని చంద్రబాబు అన్నారు. ‘‘బాబాయిని చంపిన వారికి ఎంపీ సీటు ఇచ్చారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలుపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.. చట్టాలపై గౌరవం లేదు‘‘ అని విమర్శించారు.ఉమ్మడి కర్నూలు, నెల్లూరు జిల్లాలో బాబు ప్రజాగళం సభలు..

Tags

Read MoreRead Less
Next Story