CBN: శిశుపాలుడివి 100 తప్పులు... జగన్‌వి 1000 తప్పులు

CBN: శిశుపాలుడివి 100 తప్పులు... జగన్‌వి 1000 తప్పులు
కమలాపురం బహిరంగ సభలో మండిపడ్డ చంద్రబాబు.... జగన్‌ రాజకీయ వ్యాపారి అన్న తెలుగుదేశం అధినేత

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దృశ్యం మారిపోతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. శిశుపాలుడు వంద తప్పులు చేస్తే జగన్ వెయ్యి తప్పులు చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గాలికోదిలేశారన్న చంద్రబాబు ఎర్రచందనం స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్న ఆయన దొంగ ఓట్ల అక్రమాలకు మూల్యం చెల్లించక తప్పదని.... వెంకటగిరి, కమలాపురం సభల్లో పేర్కొన్నారు.


రా కదిలిరా సభల్లో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి, కడప జిల్లా కమలాపురం బహిరంగ సభలకు హాజరైన చంద్రబాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. ఏపీలో ఉద్యోగులు జీతం అడిగితే జైలుకు పంపే దుస్థితి నెలకొందని మండిపడ్డారు. వైసీపీ వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా అని నిలదీసిన చంద్రబాబు.. ఎమ్మెల్యే ఆనం జగన్ పాలన బాగోలేదని చెబితే..ఆయన్ను దూరం పెట్టేశారని విమర్శించారు. ఆనం ప్రజాహితం కోసం మాట్లాడినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెయ్యి తప్పులు చేసిన సీఎంను ఇంకా భరిస్తారా అని ప్రజలను కోరారు. ఓట్ల అక్రమాలపై ఫిర్యాదులను వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదన్న ఆయన, వైకాపాకు వంతపాడి వారిపై చర్యలు తప్పవన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు వైసీపీ టికెట్లు ఇస్తోందని, అక్రమ మైనింగ్‌తో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్‌ రాజకీయ వ్యాపారి అని విమర్శించిన చంద్రబాబు ప్రజలను పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. TDR బాండ్లతో 25 వేల కోట్ల కుంభకోణం చేశారన్న ఆయన అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామన్నారు.


వివేకా హత్య ఉదంతాన్ని గుర్తుచేసిన చంద్రబాబు జగన్‌పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. దోపిడీలో నిమగ్నమై ప్రజలను గాలికొదిలేశారని మండిపడిన చంద్రబాబు విచ్చలవిడిగా పన్నులు పెంచేసి పేదల నడ్డివిరిచారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే పేదలను కోటీశ్వరులుగా చేసేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళతామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు.రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులని ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీకి పాలన ఎలా చేయాలో తెలుసని. సంపద ఎలా సృష్టించాలో, పేదవాడికి ఎలా న్యాయం చేయాలో తెలుసని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నామన్న తెలుగుదేశం అధినేత... కడప స్టీల్‌ ప్లాంట్‌కు రెండు సార్లు రిబ్బన్‌ కట్‌ చేశారని గుర్తు చేశారు. రిబ్బన్‌లు కట్‌ చేయడం, రంగులేయడం, పథకాలకు పేర్లు పెట్టుకోడంపై ఉన్న శ్రద్ధ పనిమీద లేదన్నారు. రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత తనదని... కాలువల్లో నీళ్లు కాదు.. రైతుల కన్నీళ్లు పారుతున్నాయన్నారు. నీళ్లు తప్ప రాయలసీమకు అన్ని అనుకూలతలు ఉన్నాయన్న చంద్రబాబు... ఉపాధి కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని... ఇక్కడి ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన దాంట్లో 20శాతం కూడా ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story