పట్టాభిపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

పట్టాభిపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు
పట్టాభి ఇంటివద్ద సెల్‌టవర్‌ డంప్‌ను సైబర్‌ పోలీసుల సాయంతో జల్లెడపడుతున్నారు.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నడిబొడ్డున నిన్న ఉదయం పట్టాభిపై దాడి చేశారు దుండగులు. కర్రలు, రాళ్లు, రాడ్లతో పట్టాభిపై విచక్షణరహితంగా దాడి చేసిన నిమిషాల్లో పరారయ్యారు. ఈ ఘటనపై విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ హర్షవర్ధన్‌రాజుతో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. నిందితులు వెళ్లిన మార్గంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు, నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను సీపీ ఏర్పాటుచేశారు. పట్టాభి ఇంటివద్ద సెల్‌టవర్‌ డంప్‌ను సైబర్‌ పోలీసుల సాయంతో జల్లెడపడుతున్నారు.

మరోవైపు పట్టాభి స్టేట్‌మెంటును పోలీసులు రికార్డు చేశారు. ఇద్దరు రౌడీషీటర్లు కొక్కిలగడ్డ జాన్‌, మధు సాయంతో ఇతర ప్రాంతాల నుంచి కిరాయి హంతకులను తీసుకొచ్చి దాడి చేయించారని పట్టాభి పోలీసులకు తెలిపారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు పదిమంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులకు వివరించారు పట్టాభి. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితులు స్థానికులు కాదన్న నిర్ణయానికి వచ్చారు. పట్టాభిపై హత్యాయత్నం, మారణాయుధాలతో గుంపుగా వచ్చి దాడి చేయడం, కారు ధ్వంసం, అడ్డగింపు, తదితర కారణాలతో మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద కేసు పెట్టారు.

దాడి జరిగిన తీరును చూస్తే.. ప్రణాళిక ప్రకారమే చేసినట్లుగా కనిపిస్తోందన్నారు పోలీసులు. పట్టాభి ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అందుకే మలుపు తీసుకున్నాకే దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. స్పీడ్‌బ్రేకర్‌ వద్ద వాహనవేగం తగ్గుతుందని.. ఆ ప్రాంతాన్నే దాడికి ఎంచుకున్నారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం ఎదురుగా ఉన్న ఇంట్లో సీసీ కెమెరా ఉన్నా.. దూరంగా ఉండటంతో విజువల్స్‌లో క్లారిటీ లేదు. దాడి చేసి, వెంటనే పరారయ్యేందుకు వీలుగా రెండు బైక్‌లు స్టార్ట్‌ చేసి ఉంచారు. అదే సమయంలో ఓ కారు అటుగా వెళ్లింది. ఇది నిందితులదేనా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దుండగుల దాడిలో గాయపడిన పట్టాభిని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే, ఈసీజీ, స్కాన్‌ తీశారు. ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. అయితే, పట్టాభి మాత్రం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. తనపై దాడికి పూర్తి బాధ్యత సీఎం జగన్‌, సజ్జల, మంత్రి కొడాలి నాని తీసుకోవాలన్నారు. రాష్ట్ర సీఎం అయినా, మంత్రి అయినా చట్టాలకు అతీతులు కారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాను ఒంటినిండా గాయాలతో ఇబ్బంది పడుతుంటే.. పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారని, ఏడుస్తున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags

Next Story