TDP: వైసీపీ గ్రూపు తగాదాల వల్లే రజినీ కార్యాలయంపై దాడి!

TDP: వైసీపీ గ్రూపు తగాదాల వల్లే రజినీ కార్యాలయంపై దాడి!
పోలీసులు అమయాకులను అరెస్ట్‌ చేశారన్న టీడీపీ... బాధితులను కలిసి ధైర్యం చెప్పిన నేతలు

వైసీపీలోని గ్రూపు రాజకీయాల వల్లే మంత్రి విడదల రజినీ కార్యాలయంపై దాడి జరిగి ఉంటుందని తెలుగుదేశం నేతలు అన్నారు. మంత్రి కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి 30మంది తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు తెలుగుదేశం, జనసేన నేతలు కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున న్యాయ సహాయం అందిస్తామని... ధైర్యంగా ఉండాలని సూచించారు. కొత్త సంవత్సరం సందర్భంగా NTR విగ్రహం వద్దకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్‌ చేశారని......... ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడివల్లే అమాయకులపై కేసులు పెట్టారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. అసలేం జరిగిందో తెలియకుండా... పోలీసులు గందరగోళం సృష్టిస్తున్నారని.. నక్కా ఆనందబాబు విమర్శించారు.


మరోవైపు గుంటూరులోని తన నూతన కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడిని ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం నేతలు కావాలనే పక్కా ప్రణాళికతో అర్ధరాత్రి దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలే పెట్టేది లేదన్న మంత్రి ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్న విడదల రజినీ.. కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని జీర్ణించుకోలేకే దాడి చేశారని తెలిపారు.

అయితే మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఘటనలో... పోలీసులు రోడ్డున పోయే వారిని సైతం అరెస్టు చేయటం విమర్శలకు తావిస్తోంది. మొత్తం 50 మందిని పట్టాభిపురం పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అరెస్టైన వారిలో పల్నాడు జిల్లా వేలూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు కూడా ఉన్నారు. పేరేచర్లకు చెందిన పాములపాటి రాంబాబు తన కుటుంబంతో కలిసి చర్చికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా... కార్యాలయం వద్ద జరుగుతున్న గొడవను చూసి వాహనాన్ని పక్కకు నిలిపారు. పచ్చ చొక్కా వేసుకున్నాడన్న కారణంతో.. ఆయన్ను కూడా పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఏ ఆధారాలతో తన భర్తను నిర్భందించారంటూ...రాంబాబు భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరోవైపు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించాలంటే... తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ ఎంపీ మాగంటి బాబు ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏలూరులోని ఆయన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గజ మాలతో మాగంటి బాబు దంపతులను సత్కరించి.....నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని....కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story