RAGHURAMA: మూడుసార్లు చంపాలని చూశారన్న రఘురామ

RAGHURAMA: మూడుసార్లు చంపాలని చూశారన్న రఘురామ
కస్టోడియల్ హింసపై మరోసారి చంద్రబాబుకు ఫిర్యాదు... తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి

ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు.. సీఎం చంద్రబాబుకు మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై కస్టోడియల్ హింసకు కారణమైన కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోనికి తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని గుర్తు చేశారు. మూడుసార్లు తనను హత్య చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. వైసీపీ పాలనలో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కీలక సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను పీవీ సునీల్‌కుమార్‌ బెదిరిస్తున్నారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. ఆయన్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని లేఖలో కోరారు. తన ఫిర్యాదు ఆధారంగా పీవీ సునీల్‌కుమార్, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, నాటి సీఎం జగన్, విజయ్‌పాల్, డాక్టర్‌ ప్రభావతి, మరికొందరిపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో జులై 11న హత్యాయత్నం కేసు నమోదైందని.. ఈ కేసులో దర్యాప్తు బృందం ఇప్పటికే ఆధారాలు సేకరించిందని అన్నారు. తన నుంచి పలువురు సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారని.. ఈ కేసులో నాలుగో నిందితుడైన విజయ్‌పాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు సునీల్‌కుమార్‌ సాక్షుల్ని బెదిరిస్తున్నారని... అందుకే వెంటనే చర్యలు చేపట్టాలని రఘురామ లేఖలో వివరించారు.

జగన్ కేవలం ఓ ఎమ్మెల్యే

జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే అని రఘురామ అన్నారు. జగన్ తిరుమల దర్శనానికి వెళ్తే నీతో పాటు మరికొందర్ని అనుమతిస్తారని... కానీ వందలు, వేల మందితో కలిసి వెళ్లాలని ప్లాన్ చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో తీసివేసిన రూల్ ను టీటీడీ ఈవో శ్యామలరావు తిరిగి పునరుద్ధరించారన్నారు. ఇలా ప్రభుత్వాలు సైతం ఎన్నో పాత నిర్ణయాలను అమలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. మీరు రూల్ పాటించకుండా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నెయ్యి కల్తీపై ఎన్‌డీడీబీ టెస్టులు జరిపి నిజమేనని తేల్చిందన్నారు.

బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ..

ఈ మేరకు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనపై జరిగిన కస్టడీయల్ హింసపై, చర్య తీసుకోవాల్సిందిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు రఘురామ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సీఐడీ అధికారి విజయపాల్ కు ముందస్తు బెయిలు నిరాకరించడం, పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ దర్యాప్తులో జోక్యం చేసుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతున్నందున ఈ కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

Tags

Next Story