AP: దగా డీఎస్సీపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

AP: దగా డీఎస్సీపై భగ్గుమన్న  ఉద్యోగ సంఘాలు
ఉపాధ్యాయ చరిత్రలో చీకటి రోజని ఆవేదన.... రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాల

ఆంధ్రప్రదేశ్‌లో దగా DSC నోటిఫికేషన్‌ విడుదల.. ఉపాధ్యాయులు చరిత్రలో ఒక చీకటి రోజని.. UTF నేతలు మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు చేసి అప్రెంటిస్ విధానం రద్దు చేయిస్తే మళ్లీ వైసీపీ ప్రభుత్వం పునరుద్ధరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దాన్ని రద్దు చేసి 25వేల పోస్టులతో మెగా DSC ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ సర్కార్‌ తీరుకు నిరసనగా నోటిఫికేషన్ ప్రతులను చాలా చోట్ల దగ్ధం చేసి ఆందోళన చేశారు. శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలో DSC నోటిఫికేషన్ ప్రతులను UTF నేతలు దగ్ధం చేశారు. బానిస వ్యవస్థ అయిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. తక్షణమే ఉపసంహరించుకోకపోతే వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పార్వతీపురంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అప్రెంటిస్ విధానం రద్దు చేయాలని కోరుతూ UTF నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.


వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ విడుదల చేసిన రోజు ఉపాధ్యాయులు చరిత్రలో చీకటి రోజని యూటీఎఫ్ నాయకులు అభివర్ణించారు. దాదాపు 25 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని అనుకుంటే... కేవలం 6వేల100 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో యూటీఎఫ్ ఆధర్యంలో ఉపాధ్యాయులు డీఎస్సీ నోటిఫికేషన్ ఉత్తర్వులను తగలబెట్టారు. రెండు సంవత్సరాల అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని... డిమాండ్‌ చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. గతంలో ఉన్న అప్రెంటిస్ విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాడి రద్దు చేయించాయని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం మరోసారి ఈ విధానాన్ని తీసుకురావటాన్ని ఖండిస్తున్నామని... ఇప్పటికైనా దానిని రద్దు చేయాలని కోరారు.

మెగా DSC ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమను మోసం చేశారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురుజాడ గ్రంథాలయం నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి మినీ DSC వద్దు మెగా DSC కావాలని నినదించారు. ఎన్నికల ముందు 23 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేశారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. మెగా DSC వేయకుంటే సీఎం జగన్ ను ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు 6 వేల పోస్టులతో మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story