Anjaneya : ఆంజనేయుడు లేని ఒకే ఒక రామాలయం

ఏపీలోని లోని ఒంటిమిట్ట రామాలయానికి ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఆంజనేయుడు లేని రామాలయం ఇదొక్కటే. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఈ విశిష్టమైన రామాలయంలో సీత, రాముడు, లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం ఆంధ్రా భద్రాచలంగా పేరుపొందింది. చంద్రుడి వెన్నెలలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఈ దేవాలయ ప్రత్యేకత.
శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం. ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాచలం గా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు.
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు.
దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com