TDP: విజయమే లక్ష్యంగా..టీడీపీ అడుగులు..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ దూకుడు పెంచింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇటు పార్టీలో చేరికలు అటు మేనిఫెస్టోతో జనంలోకి వెళ్తోంది. వైసీపీకి షాక్ ఇస్తూ జగన్ ఇలాకా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా టీడీపీలోకి చేరారు. తెలుగుదేశం కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు.. జగన్ నాలుగేళ్ల ఆరాచక పాలనపై నిప్పులు చెరిగారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధమని తేల్చిచెప్పారు. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ పులివెందులలోను ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు తేల్చిచెప్పారు. జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలని వాళ్లే లీకులిస్తారు వాళ్లే ఖండిస్తారని విమర్శించారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే రాష్ట్రానికి పట్టిన శని అంత తొందరగా పోతుందని చంద్రబాబు అన్నారు.
ఇక దసరాకు టీడీపీ రెండో విడత మేనిఫెస్టో రిలీజ్‌కు సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రజలపై పలు హామీలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. జగన్ పేదలపై 51 వేల కోట్ల మేర విద్యుత్ భారం వేశారని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. జగన్ తెచ్చిన అమ్మఒడి బూటకమని ఆరోపించారు. ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి తాము 15 వేలు ఇస్తామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని పరిశ్రమలు పెట్టుబడులు తెస్తామని చెప్పారు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com