AP : బొత్స, ధర్మాన కుటుంబాలకు షాకిచ్చిన ఓటర్లు

వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన మంత్రి బొత్స సత్యనారాయణకు ఓటమి తప్పలేదు. ఆయన భార్య, సోదరుడు సైతం పరాజయం పాలయ్యారు. చీపురుపల్లిలో కళా వెంకట్రావు చేతిలో 11,971 ఓట్ల తేడాతో బొత్స ఓడిపోయారు. గజపతినగరంలో పోటీ చేసిన ఆయన సోదరుడు అప్పలనర్సయ్య 25,301 ఓటమి చెందారు. విశాఖ ఎంపీగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ.. టీడీపీ అభ్యర్థి భరత్ చేతిలో 4,96,063 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయి ఇంటిదారి పట్టారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి పోటీలో నిలిచిన ధర్మాన కృష్ణదాస్ కూడా టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతానే తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు ఊడ్చిపారేశాయి. కాగా వైసీపీ కేవలం 11 సీట్లే దక్కించుకుంది.
విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సంచలన విజయం నమోదు చేసింది. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై 94,058 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. ఇక అదే జిల్లాలోని భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com