నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం

నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం

కడప జిల్లా ఒంటిమిట్టలో నేడు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో శ్రీరామ నవమి రోజున కళ్యాణం జరుపుతారు. ఇక్కడ మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున పండువెన్నెల్లో స్వామివార్ల పెళ్లి వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ ఉత్సవానికి సీఎం జగన్ బదులు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

ఈ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంట‌ల వ‌ర‌కు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తుల ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతాఅధికారులు అంచనా వేస్తోన్నారు. కల్యాణోత్సవాన్ని నేరుగా తిలకించలేనివారి కోసం 28 ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు. గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఉపశమనం కలిగించడానికి 200కి పైగా ఎయిర్ కూలర్లను అందుబాటులో ఉంచారు. సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందిస్తారు. దీనికోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది.

అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటారు.

Tags

Read MoreRead Less
Next Story