YCP: ముద్దనూరులో వైసీపీ దౌర్జన్యం

YCP: ముద్దనూరులో వైసీపీ దౌర్జన్యం
తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు... వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలోనే తెగబడ్డ వైసీపీ శ్రేణులు

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ముద్దనూరులో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం రణరంగాన్ని తలపించింది. వైసీపీ నాయకుడు శశిధర్‌ రెడ్డి అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరే కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున వచ్చిన వైసీపీ శ్రేణులు శశిధర్‌ని అడ్డుకుని తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇరువర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నిర్వాకమంతా జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమక్షంలోనే జరగడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. YSR జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరులో వైసీపీ, తెలుగుదేశం వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమీప బంధువు, ఎంపీపీ మునిరాజారెడ్డి సోదరుడు శశిధర్‌ రెడ్డి ఈ నెల 19న కమలాపురంలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.


ఇవాళ జమ్మలమడుగు తెలుగుదేశం ఇంఛార్జి భూపేష్‌రెడ్డి సమక్షంలో తన అనుచరులను చేర్చేందుకు ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులతో వెళ్లి శశిధర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. బలవంతంగా శశిధర్‌రెడ్డిని ఇంటి నుంచి లాక్కెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నేతల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వారిని నిలువరిచలేక చేతులెత్తయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మలమడుగు నుంచి ముద్దనూరు చేరుకున్న తెలుగుదేశం ఇంఛార్జి భూపేష్‌రెడ్డి... శ్రేణులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భూపేష్‌రెడ్డిని బలవంతంగా స్టేషన్‌కి తీసుకెళ్లారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని తీసుకెళ్లి ఓ ఇంట్లో కూర్చోబెట్టారు. ఎట్టకేలకు ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు ముద్దనూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలపైనా కేసులు నమోదు చేశారు.


తెలుగుదేశం నేతలపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. వైసీపీ శ్రేణులను బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నారని శశిధర్‌రెడ్డిని పక్కన పెట్టుకుని ఆరోపించారు. ఈ నెల 19న తెదేపాలో చేరిన శశిధర్‌రెడ్డి అనుచరులను చేర్చుతామంటేనే ఆయన నివాసానికి వచ్చామని టీడీపీ ఇంఛార్జి భూపేష్‌ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ధ్వజమెత్తారు.

Tags

Next Story